తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవిది ఒక ప్రత్యేక స్థానం. స్వయంకృషితో సుప్రీం హీరోగా, అటుపై మెగాస్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్థానం అసామాన్యం. 25 ఏళ్లకు పైగా సినిమాల్లో నెం.1 గా ఉన్న ఆయన కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే 2008లో రాజకీయాల్లోకి వెళ్లి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. అటుపై పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. 2017 లో తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ఈ తొమ్మిదేళ్లు చిరంజీవికి చేదు జ్ఞాపకాలే మిగిల్చాయి. సినిమాల్లో అందరివాడుగా వున్న చిరంజీవిని రాజకీయాలు కొందరివాడిని చేశాయి. పాలిటిక్స్ లో ఆయన పరిస్థితికి లక్షలాది హార్డ్ కోర్ ఫ్యాన్స్ తట్టుకోలేక తిరిగి సినిమాల్లోకి రావాలని కోరారు. కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం.150 తో రికార్డులు తిరగరాసి సినిమాల్లో తానే రారాజునని నిరూపించారు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలోనూ లేని చిరంజీవి సినిమాలు మాత్రమే చేస్తున్నారు.

 

ఇప్పుడు మళ్లీ చిరంజీవి చుట్టూ రాజకీయం నడుస్తోంది. చిరంజీవి బీజేపీలోకి వస్తున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి క్లారిటీ లేకపోయినా, ఆయనకు రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన కమిట్ అయిన సినిమాలే చెప్తున్నాయి. అయినా.. మెగాభిమానులు “మళ్లీ మా అన్నయ్యను పాలిటిక్స్ లోకి లాగొద్దు.. దయచేసి రాజకీయ పార్టీలు తమ స్వార్ధం కోసం చిరంజీవి గారిని బలిచేయొద్దు. మా అన్నయ్య కొందరివాడు కాదు అందరివాడు, ఆయన్ను వదిలేయండి” అని వేడుకుంటున్నారు. “చిరంజీవి గారు, అన్నయ్య, బాస్” ఇవీ మేము ఆయన్ను పిలుచుకునే పేర్లు. మీరు తీసుకెళ్లి ఆయన్ని రాజకీయాల్లో ‘సర్’ ని చేయొద్దంటున్నారు.

 

“చిరంజీవి తమతో ఉండాలి కానీ కార్యకర్తలతో కాదు” అని ఫ్యాన్స్ అంటున్నారు. చిరంజీవి ఆత్మీయ పలకరింపే మాకు కావాలి. దేశంలో ఏ సినిమా కుటుంబం నుంచి లేనంతమంది హీరోలు ఆయన కుటుంబంలో ఉన్నారు. వాళ్లను గైడ్ చేస్తూ మా బాస్ సినిమాలు చేసుకుంటుంటే చాలు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఇమేజ్ మరింతగా పెరుగుతుందనేది వారి ఆశ. మరి.. చిరంజీవి ఆ మెగాభిమానుల ఆశ నెరవేరుస్తారని ఆశిద్దాం. హీరో వర్షిప్ ఈజ్ యునిక్ కదా!


మరింత సమాచారం తెలుసుకోండి: