ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు.

 

విజయనిర్మల తండ్రిది స్వస్థలం చెన్నై కాగా, తల్లిది గుంటూరు జిల్లా నరసరావుపేట. తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు విజయనిర్మల. జయనిర్మల అసలు పేరు నిర్మల. తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్‌కు కృతజ్ఞతగా విజయనిర్మలగా పేరు మార్చుకున్నారు.

 

ప్రముఖ నటుడు నరేశ్‌ విజయనిర్మల కుమారుడు. నటి జయసుధకు ఈమె పిన్ని. 1950లో మత్య్సరేఖ అనే తమిళ చిత్రం ద్వారా విజయనిర్మల తన ఏడో ఏటనే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. పదకొండో ఏట ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.

 

ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. తొలిసారి ఆమె ‘మీనా’ అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించగా.. అప్పటి నుంచి 2009 వరకూ మొత్తం 44 సినిమాలు తీశారు. సాక్షి’ చిత్రంతో తొలిసారిగా సూపర్‌స్టార్‌ కృష్ణతో నటించారు విజయనిర్మల. ఈ చిత్రమే వారి వివాహ బంధానికి కారణమైంది. తిరుపతిలో వీరి వివాహం జరిగింది. వివాహం అయ్యాక విజయ నిర్మల ‘అమ్మకోసం’ చిత్రంలో నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: