రెండు బ్రెయిన్‌లతో పుట్టిన ఓ యువకుడి కథ ఇది. అభి, రామ్ అనే పేర్లతో పిలవబడే అతడి జీవితగమనంలో ఎదురయ్యే సంఘటనలు నవ్విస్తూనే భావోద్వేగానికి లోను చేస్తాయి. నా కెరీర్‌లో వైవిధ్యమైన సినిమా అవుతుందనే ఆలోచనతో అంగీకరించాను. వినూత్నమైన పాత్రలు చేస్తున్నప్పుడు భయంతో పాటు సవాళ్లు ఎదురవుతుంటాయి. అభి, రామ్ పాత్రల మధ్య వైవిధ్యతను నేను సరిగా చూపించగలనా?లేదా? అనే భయం సినిమా మొత్తం వెంటాడింది. ఇప్పటికీ ఆ భయం అలాగే ఉంది.

 

అభి పాత్ర నవతరానికి ప్రతీకగా సరదాగా సాగితే రామ్ మాత్రం వివేకానందుడు, అబ్దుల్‌కలాం మాదిరిగా పేరుతెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. క్లిష్టమైన కథను ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా సింపుల్‌గా రత్నబాబు తెరపై ఆవిష్కరించారు. దర్శకుడిగా ఇదే తొలి సినిమా అయినా రచయితగా తనకున్న అనుభవన్నంతా ఉపయోగించి తెరకెక్కించారు. ప్రాసలతో కూడిన సంభాషణలు అలరిస్తాయి.

 

ప్రస్తుతం ప్రేక్షకులు రొటీన్ సినిమాల్ని ఇష్టపడటం లేదు. అందుకే కథాంశాల పరంగా వైవిధ్యతకే ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రేమకావాలి, లవ్‌లీ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం నాకు రాలేదు. పేరు, డబ్బుతో పాటు ప్రశంసలు లభించడమే నా దృష్టిలో అసలైన విజయం. అలాంటి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాను. పెళ్లి తర్వాత ప్రేమకథల్లో నటించే విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే లిప్‌లాక్‌లు, రొమాన్స్ ఎక్కువగా ఉండే సినిమాలు చేయను.

 

ప్రస్తుతం ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ సినిమా చేస్తున్నాను. కశ్మీర్ పండిట్ల సమస్యలను ఆవిష్కరిస్తూ యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు అడివి సాయికిరణ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో అర్జున్ పండిట్ అనే ఆర్మీ మేజర్‌గా కనిపిస్తాను. అలాగే జోడీ పేరుతో ఓ ప్రేమకథలో నటిస్తున్నాను. దీనితో పాటు ఓ ద్విభాషా సినిమా చేస్తున్నాను.


మరింత సమాచారం తెలుసుకోండి: