అడ్డంకులు ఎన్ని వచ్చినా ‘మల్లేశం’ అధైర్యపడలేదు...ముందడుగు వేసి ఆసు యంత్రాన్ని రూపొందించారు! తెరపై మల్లేశం సతీమణిగా నటించిన అనన్య నాగళ్ల కూడా అంతే...పల్లెటూరి అమ్మాయిగా పనికి రాదనీ... పద్మ పాత్రకు సరిపోదనీ... ఎవరేమన్నా పట్టించుకోలేదు. పట్టుబట్టి పాత్రలో నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు! ఆమె నేపధ్యం ఆమె మాటల్లోనే...

 

మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. నాకు మూడేళ్ల వయసున్నప్పుడు నాన్న యాక్సిడెంట్‌లో మరణించారు. అప్పట్నుంచి అన్నయ్యను, నన్ను అమ్మే పెంచి పెద్ద చేసింది. తనే నా బలం. నేను ప్లస్‌ 2 వరకూ ఖమ్మంలోనే చదువుకున్నా. మా చదువుల కోసం హైదరాబాద్‌ షిఫ్టయ్యాం. ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశాక... ఇన్ఫోసి్‌సలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశాను.

 

‘మల్లేశం’ చిత్రానికి యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మా గురువుగారు మహేశ్‌ ‘డైరెక్టర్‌ ఆఫ్‌ యాక్టింగ్‌’గా వ్యవహరించారు. సార్‌తో రాజ్‌గారు కాస్టింగ్‌, యాక్టింగ్‌ గురించి డిస్కస్‌ చేసేవారు. సినిమా స్ర్కిప్ట్‌ అంతా మా ఇన్‌స్టిట్యూట్‌లో ఉండేది. మేం ప్రాక్టీస్‌ చేసేవాళ్లం. కానీ, సినిమాలో నాకు ఛాన్స్‌ వస్తుందనుకోలేదు. స్ర్కిప్ట్‌ చదివాక... చింతకింది మల్లేశంగారి టెడ్‌టాక్స్‌ వీడియో చూశా. ఎంతో స్ఫూర్తివంతంగా అనిపించింది.

 

రాజ్‌గారు ఎంపిక చేశారు కానీ... చాలామంది ఆయనతో నన్ను తీసుకోద్దని నా ముందే చెప్పారు. ‘ఈ అమ్మాయి గ్లామర్‌గా ఉంది. పల్లెటూరి అమ్మాయిలా సెట్‌ కాదేమో’ అని కొందరు... ‘సింక్‌ సౌండ్‌లో చేస్తున్నాం. తెలంగాణ యాస ఈ అమ్మాయికి రాదేమో’ అని మరికొందరు... ‘షార్ట్‌ ఫిల్మ్స్‌ హీరోయిన్‌, సినిమా అంతా చేయగలదా? అని ఇంకొకరు... చాలా అనుమానాల్ని వ్యక్తం చేశారు. కానీ చివరకు ఏం జరిగిందో మీకు తెలుసు కదా అని అమ్మడు గొప్పలు పోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: