• నాకు మార్గదర్శకులుగా వ్యవహరించాలి
• జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు 


జనసేన పార్టీ హితం కోరుకొనే శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు త్వరగా కోలుకోవాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆకాంక్షించారు. నాకు, పార్టీకి మార్గదర్శకులుగా వ్యవహరించాలని కోరితే వారు అందుకు అంగీకారం తెలిపారని చెప్పారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ శ్రీ హరిరామ జోగయ్య అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం శ్రీ పవన్ కల్యాణ్ గారు శ్రీ హరిరామ జోగయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “నిబద్ధత కలిగిన హరిరామ జోగయ్య గారు నరసాపురం పార్లమెంట్ సభ్యులుగా 2004-09 కాలంలో ఉండి, మా కుటుంబం కోసం రాజీనామా చేసి వచ్చారు. అనుభవజ్ఞులైన వారి సలహాలు, ఆశీస్సులు అవసరమని పోరాటయాత్ర సమయంలో పాలకొల్లు వెళ్ళి కలిశాను. ఇప్పుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పటికి కూడా జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయం గురించి చర్చించారు. హరిరామ జోగయ్యగారు నాకు మార్గరదర్శకులుగా ఉంటారు. 


• జనసేన అధ్వర్యంలో పాలకొల్లులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు 
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పాలకొల్లు నుంచి ఎందరో వచ్చారు. అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు... ఇలా చాలామంది పాలకొల్లు నుంచి వచ్చినవారే. నవతరంలో ఉన్న నైపుణ్యాన్ని తీర్చిదిద్దేలా పాలకొల్లులో శ్రీ ఎస్.వి.రంగారావు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను జనసేన అధ్వర్యంలో నెలకొల్పనున్నాం. ఈ ఇన్స్టిట్యూట్ కి హరిరామ జోగయ్య గారు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. వీరు నిర్మాతగాను ఎన్నో  మంచి చిత్రాలు అందించారు. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసు నేతృత్వంలో నడుస్తుంది. ఇందుకు నా అండదండలు ఉంటాయి. ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఉంటుంది” అన్నారు.
శ్రీ హరిరామ జోగయ్య మాట్లాడుతూ “చిరంజీవిగారు కుటుంబం అంటే నాకు ఎంతో ఇష్టం. పవన్ కల్యాణ్ గారికి అభిమానిని. జనసేన పార్టీకి ఎప్పుడూ నా సహాయసహకారాలు ఉంటాయి. చివరి శ్వాస వరకూ జనసేన కోసమే పని చేస్తాను. ప్రజలందరి క్షేమం కోరుకొంటూ... అందరినీ సురక్షితంగా చూసుకొనే పార్టీ ఇది. అందరం శ్రీ పవన్ కల్యాణ్ గారు వెన్నంటి నడుద్దాం. పాలకొల్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇస్తాం. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధం అయింది. ఈ శిక్షణాలయం ప్రారంభానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు వస్తారు” అని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: