70 ఏళ్ల బామ్మ... 24 ఏళ్ల పడుచుపిల్లగా మారిపోవడం ‘ఓ బేబీ’లో విచిత్రం. ఈ మాయ ఎలా జరిగింది? జరిగాక ఏమైంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆ మ్యాజిక్‌ ఏంటో  తెలియాలంటే ‘ఓ బేబీ’ చూడాలి. సమంత నాయికగా నటించిన ఈ చిత్రానికి నందినిరెడ్డి దర్శకురాలు. ఈనెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నందినిరెడ్డి మనకు చెబుతున్న విషయాలు..

 

‘అలా మొదలైంది’ తరవాత  అవకాశాలు వచ్చాయి గానీ, అగ్ర హీరోలు పెద్దగా స్పందించలేదు. కాకపోతే అల్లు అర్జున్‌ లాంటివాళ్లు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అగ్ర కథానాయకులతో పనిచేయాలని నాకూ ఉంది. మంచి కథ దొరికితే తప్పకుండా వాళ్ల దగ్గరకు వెళ్తాను. ఇది వరకు లేడీ డైరెక్టర్‌ అంటే అదోలా చూసేవారు. ‘ఏదో సందేశాత్మక కథ తెచ్చి ఉంటారులే’ అనుకునేవారు. ఇప్పుడు కాస్త నమ్మకం పెరిగింది.

 

మంచి కథ ఉంటే సరిపోదు.. మంచి నటీనటులు కావాలి. మంచి నటీనటులకు మంచి కథ పడాలి. ఈ రెండూ ‘ఓ బేబీ’లో జరిగాయి. సమంత, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్‌.. ఇలా అంతా హేమాహేమీలే. వాళ్లంతా కలసి ఈ సినిమాని విందు భోజనంలా తయారు చేశారు. సెట్లో వాళ్లని అలా చూస్తూ ఉండిపోయేదాన్ని. కట్‌ చెప్పడం కూడా మర్చిపోయిన సందర్భాలున్నాయి.

 

రెండు వెబ్‌ సిరీస్‌లకు కథలు అందించాను. థియేటర్లో సినిమాని అందరితో కలసి చూడాలనుకుంటాం. వెబ్‌ సిరీస్‌ని మాత్రం ఒంటరిగా చూడ్డానికి ఇష్టపడతారు. అందుకే అక్కడ సెక్స్‌, క్రైమ్‌ కథలు ఎక్కువగా వస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌లో వర్కవుట్‌ అయిన కథలు, సినిమాల్లో సరైన ఫలితాన్ని అందుకోకపోవొచ్చు. కొన్ని కథలు వెబ్‌ సిరీస్‌లకే పనికొస్తాయి. అని చెప్పుకుంటూ వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: