ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ గ్రామంలో 2014లో దళితులైన అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకొని మరణించిన యథార్థ సంఘటన ఆధారంగా.. బడుగు వర్గాల పై సమాజంలో నెలకొన్న వివక్ష నేపథ్యంతో విడుదల అయిన 'ఆర్టికల్‌-15' దేశవ్యాప్తంగా చర్చను రేకిత్తిస్తోంది. బాలీవుడ్‌ దర్శకనిర్మాత అనుభవ్‌ సిన్హా.. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నిర్మించిన 'ఆర్టికల్‌-15' మూవీపై వివాదం మొదలైంది.
ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని ఆదివారం బ్రాహ్మణ సంఘాలు ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని పలు థియేటర్ల ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. దళితుల పట్ల బ్రాహ్మణులు వివక్ష చూపినట్లు ఈ సినిమాను తీశారు ఇది సరికాదని వారి ఆరోపణ.
ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త,యువ సాహిత్య అవార్డు గ్రహీత , మెర్సీమార్గరెట్‌ ఈ సినిమా గురించి ఇలా అంటారు.
'' సినిమా తరం తర్వాత తరాన్ని ప్రభావితం చేసిన మాధ్యమం. కొన్ని సామాజిక ఉద్యమాలకు పునాదిగా నిల్చున్న మాధ్యమం. అయితే ఎక్కువ శాతం సినిమా పరిశ్రమ ఒకే కులానికి అందునా అగ్రకులాలు అని చెప్పుకునే వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయాక అన్నీ వాళ్ల జీవితాల్ని .. జీవన విధానాల్ని ప్రతిబింబించే సినిమాలొచ్చాయ్‌. దీనికి భిన్నంగా ఇపుడు బాలీవుడ్‌లో వచ్చిన సామాజిక చిత్రం ''ఆర్టికల్‌ 15''.

అయాన్‌ రంజన్‌ చురుకైన పోలీస్‌ ఆఫీసర్‌ గా ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్‌ అయ్యి ఆ ప్రాంతానికొస్తాడు. అక్కడ ఇద్దరు పదిహేనేళ్లలోపు అమ్మాయిల హత్య..ఒకమ్మాయి మిస్సింగ్‌ కేస్‌ ఒక సవాలుగా పోలీస్‌ ఆఫీసర్‌ కి ఎదురౌతుంది. అతడు సీరియస్‌ గానే తన ఇన్వెస్టిగేషన్‌ మొదలు పెడితాడు. కానీ బ్రహ్మ దత్త్‌ , ఇంకొందరు పోలీస్‌ ఆఫీసర్లు అయాన్‌ రంజన్‌ కి ఇన్వెస్టిగేషన్‌ కి సరిగా సహకరించరు. ఆ అమ్మాయిల హత్యని హానర్‌ కిల్లింగ్‌గా మార్చి కేస్‌ క్లోజ్‌ చేయాలని బ్రహ్మ దత్త్‌ తీవ్రప్రయత్నం చేస్తాడు. కానీ సఫలం కాడు. అయాన్‌ రంజన్‌ ఇన్వెస్టిగేషన్లో చాల దారుణమైన విషయం బయట పడుతుంది. మూడు రూపాయల కూలి డబ్బులు పెంచమన్నందుకు ఆ ముగ్గురు అమ్మాయిలకి ఆ గతి పట్టింది అని తెలుసుకుంటాడు.

ఇంతకీ ఆ అమ్మాయిలని ఎవరు చంపారు ? ఎలాచంపారు? ఎవరెవరు ఆ హత్యకి కారణమయ్యారు ?
చివరికి మిస్‌ అయిన ఆ అమ్మాయి దొరికిందా లేదా అన్నదే సినిమా...!!

ఇప్పటి వరకు వచ్చిన సినిమాలేవి దళితుల జీవితాల్ని వాళ్లపై జరుగుతున్న దాష్టికాల్ని ఇంత స్పష్టంగా చర్చించినట్టు మనం చూడలేదు. ఆర్టికల్‌ 15 -సినిమా ఈ అంశాన్నీ గట్టిగానే మాట్లాడింది. 
అయాన్‌ రంజన్‌ పాసిస్‌ అనే ఊరు దాటేప్పుడు, ఈ ఊరు దళితులది. వీళ్లు పందులని పెంచుతారు. వీళ్లు అంటరాని వారు అంటు సినిమా మొదలౌతుంది.
అంటరానివాళ్ళు .. ఆ జాతి వాళ్లు అలాగే ఉంటారు. ఆ జాతివాళ్లను ఎవరూ బాగుచేయలేరు. కుక్కలనైనా ప్రేమిస్తారు ముద్దు చేసి వాటి కోసం విలవిల్లాడుతారు కానీ అంటరానివాడూ.. తక్కువ జాతివాడూ అని తెలిస్తే కుక్క కన్నా హీనంగా చూస్తారు. ఇప్పుడు ఎక్కడండీ అసలు కులమతాలు లేవు అని మాట్లాడే వాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఆర్టికల్‌ 15.

అనుభవ్‌ సిన్హా గురించి చెప్పాలి.. మొదటిది'' ముల్క్‌''. ఇప్పుడు '' ఆర్టికల్‌15 '' ఎంత ధైర్యం ఈ దర్శకుడికి. బాలీవుడ్‌ జనాలంతా మోడీ కాళ్ల దగ్గర కూర్చుని అక్కడే ఆగిపోయినా.. ఈ దర్శకుడు ఆ ఛాయల్లోకి కూడా పోకుండా సమాజాన్నే తన కథాంశంగా తీసుకుని చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. డబ్బులు రావు.. బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురవదనీ తెలిసినా కూడా ఇలా సీరియస్‌ సినిమాలు చేయటానికి ఈ దర్శకుడికి ఉన్న తపన నిజంగా అభినందించాల్సిన విషయం.

ఈ సినిమాల వల్ల సమాజంలో ఎలాంటి మార్పు వస్తుందో మనం ఇప్పుడే చెప్పలేం. పోలీస్‌ ఆఫీసర్‌ అయాన్‌ లా అధ్బుతంగా నటించాడు ఆయుష్మాన్‌ ఖొరానా.. మనోజ్‌ పాహ్వ.. సయానీ గుప్తాల నటన ఆ పాత్రలనీ ఎప్పుడూ మర్చిపోనివ్వదు. ముల్క్‌ లో అమాయకంగా నటించిన మనోజ్‌ పాహ్వానేనా ఇందులో ఇలా నటించాడని ఆశ్చర్య పోతాం..
ఈ సినిమా చూసి బయటకొస్తూ నా మిత్రునితో అన్నాను .. '' బాగుంది కానీ ఎక్కడో మిస్‌ ఫైర్‌ అయ్యింది కదా కథ..'' అని.
కానీ నా మిత్రుడన్నాడు. '' నేను చాలా డిస్టర్బ్‌ అయ్యాను.. మనుషులిలా ఎందుకున్నారు.? '' అని. నా మిత్రుడి మాటలు విన్నాక అనిపించింది . అనుభవ్‌ సిన్హా ఉద్దేశ్యం నెరవేరింది.
లోపల ఎక్కడైనా నేను మనిషిని కులం కాదు అని అనిపిస్తే వెళ్ళి ఈ సినిమా చూడండి.'' 


మరింత సమాచారం తెలుసుకోండి: