సినిమా ఫంక్షన్ లలో పెద్ద సెలబ్రిటీలు వస్తే చనువుగా మాట్లాడడం మామూలే కానీ, ఒక్కోసారి ఆ మాటలు ఎక్కడో ఎవరికో తగులుతుంటాయి. అంతేకాదు ఛోటా.కె.నాయుడు లాంటి వాళ్ళ వింత చేష్టలు కూడా కొంత మందిని అయోమయానికి గురి చేస్తాయి. ఇక సమంత నటించిన ఓ బేబీ సినిమా ఫంక్షన్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వేసిన ఓ చెణుకు కూడా అలాంటిదే. రాఘవేంద్రరావు ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో అన్ని విధాలా పెద్దాయన. ఓ బేబీ సినిమాకు కీలకమైన నిర్మాత సురేష్ బాబుకు కానీ, సమంత అక్కినేని ఫ్యామిలీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. 

ఆయన వారి గురించి ఎలాగైనా మాట్లాడగలరు. ఎలాంటి కామెంట్సైనా చేయగలిగే చనువు ఉంది. ఈ విషయం గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక ఓ బేబీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ తాను సినిమా చూసానని, చాలా బాగుందని,  నలుగురు నిర్మాతలు కాబట్టి, అందరికీ మాంచి లాభాలు వస్తాయని అంటూనే.. సురేష్ బాబు లెక్కలు సరిగ్గా చెప్పాలని చిన్న ఝలక్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా, అక్కడే వున్న రానాను చూస్తూ.. 'రానా డాడీకి చెప్పు అక్కౌంట్స్ సరిగ్గా చెప్పమని, అసలే అన్నీ దాచేస్తుంటాడు. నా వంతు వాటా కూడా వుంది' అన్నారు.   
 
అసలే ఇండస్ట్రీలో ఓ జనరల్ టాక్ వుంది. అదేమిటంటే సురేష్ మూవీస్ కు సినిమా ఇస్తే లెక్కలు సరిగ్గా చెప్పరు అని. అది నిజమో, కాదో కానీ ఆ జనరల్ టాక్ మాత్రం ఇండస్ట్రీలో బలంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాఘవేంద్రరావే పబ్లిక్ గా ఇలా అనడంతో, ఇకపై ఆ టాక్ మరింత బల పడనుందేమోనని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా దర్శకేంద్రుడే సురేష్ బాబు మీద ఇలా కామెంట్స్ చేయడం సంచలనం అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: