తెలుగు సినిమాల్లో పేరొందిన దర్శకులెందరో ఉన్నా ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. వారిలో తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకుని మాస్, కుటుంబ సినిమాలకు చిరునామాగా మారిన దర్శక దిగ్గజం కోదండరామిరెడ్డి ఒకరు. తెలుగు సినిమాలో లిఖించదగ్గ చిత్రరాజాలను నిర్మించారు. సంధ్య సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన కోదండరామిరెడ్డి తెలుగు, హిందీ భాషల్లో కలిపి 92 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన 70వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ఈ కథనం..


మనతో పాటే మన నీడ అన్నట్టు కోదండరామిరెడ్డి పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే పేరు చిరంజీవి. అంతటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ వీరిద్దరిదీ. ఈయన దర్శకత్వంలో వచ్చినే ఖైదీ సినిమాతోనే చిరంజీవి సూపర్ స్టార్ అయిపోయారు. హీరో చిరంజీవిని సుప్రీం హీరో అటుపై మెగాస్టార్ ని చేసి ప్రేక్షకుల గుండెల్లో ఖైదీని చేశారు. కెరీర్ లో అత్యధికంగా చిరంజీవితో 23 చిత్రాలు రూపొందించారు. వీటిలో 17 హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. వీరి కాంబినేషన్ తెలుగు సినిమాల్లోనే హైలైట్. కోదండరామిరెడ్డి చిరంజీవికి మాత్రమే పరిమితం కాలేదు. బాలకృష్ణతో నారీ నారీ నడుమ మురారి, బొబ్బిలిసింహం, భలేదొంగ నాగార్జునతో విక్కీదాదా, ప్రెసిడెంటుగారి పెళ్లాం, అల్లరి అల్లుడు, వెంకటేశ్ తో కొండవీటి రాజా, పోకిరి రాజా, కమల్ హాసన్ తో ఒకరాధ ఇద్దరు కృష్ణుడు తీశారు. దర్శకుడిగా అందరు హీరోలతో, అన్ని రకాల సినిమాలూ చేసిన ఘనత ఆయన సొంతం. ఆయన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్, సెంటిమెంట్, కామెడీ అద్భుతంగా పండిస్తారు. తనకున్న మ్యూజిక్ సెన్స్ తో అన్ని సినిమాల్లో మ్యూజిక్ బాగుండేలా చూసుకున్నారు.  


ఆయన 70వ జన్మదిన వేడుకలు గత రాత్రి ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, దిల్‌ రాజు, అనిల్ సుంకర, దర్శకులు బి. గోపాల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్. నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీతదర్శకుడు కోటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఏపీ హెరాల్డ్.


మరింత సమాచారం తెలుసుకోండి: