గత వారమే విడుదల కావాల్సిన ‘బుర్రకథ’ చిత్రం ఈ శుక్రవారానికి వాయిదా పడింది. జులై 12న రావాల్సిన ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాతి వారానికి వెళ్లిపోయింది. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ డేట్ మారిపోయింది. ఈ నెల 18కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రాక్షసుడు’ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. రెండు వారాలు ఆలస్యంగా..  ఆగస్టు 2న ఈ చిత్రం విడుదల కానుంది. కొత్త రిలీజ్ డేట్‌తో పోస్టర్లు కూడా పడిపోయాయి.

 

అసలే బెల్లంకొండ శ్రీనివాస్ వరుస ఫ్లాపులతో అల్లాడుతున్నాడు. ఇలాంటి టైంలో ‘ఇస్మార్ట్ శంకర్’తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలతో విడుదలవుతున్న ‘లయన్ కింగ్’తో పోటీ పడటం ప్రమాదకరమని ‘రాక్షసుడు’ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

 

‘ఇస్మార్ట్ శంకర్’ ముందు అనుకున్నట్లు 12నే వస్తే ‘రాక్షసుడు’ను అనుకున్న ప్రకారమే రిలీజ్ చేసేవాళ్లేమో. కానీ అది పోటీకి రావడం, ‘లయన్ కింగ్’ అంచనాలు పెరిగిపోతుండటంతో బెల్లంకొండ సినిమాను వాయిదా వేసేశారు. ఐతే ఆగస్టు 2న శర్వానంద్ సినిమా ‘రణరంగం’ షెడ్యూల్ అయి ఉంది. దాంతో పోటీ అన్నా కష్టమే. ఐతే ఆ చిత్రం వాయిదా పడే అవకాశాలున్నట్లు సమాచారం అందడంతోనే ధీమాగా ఆ డేట్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది.

 

తమిళ హిట్ ‘రాక్షసన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘రాక్షసుడు’ చిత్రాన్ని రమేష్ వర్మ రూపొందించాడు. శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిందీ థ్రిల్లర్ సినిమాలో. బేసిక్ గా అంత ఆశావాహకంగా సినిమా కెరీర్ లేని టైం లో శ్రీనివాస్ 'రాక్షసుడు' ట్రైలర్ ఒక ఆశా ద్వీపం లా కనిపించింది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమానే వాయిదా పడుతోంది. ఆలస్యం అమృతం..విషం.. అమృతమే కావాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: