సమాజంలో పేరున్న వ్యక్తి.. తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని, రేప్ చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేస్తే? చాలా మంది నిజమే అనుకుంటారు. చట్టాలు కూడా స్త్రీలకే అనుకూలంగా ఉంటున్నాయి. మరో రకంగా చెప్పాలంటే ఒకింత పక్షపాత ధోరణిలోనే ఉంటున్నాయి. కానీ మహిళలు చట్టాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని తప్పుడు ఆరోపణలు చేస్తే..? ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తే..? నిందితుడే అసలైన బాధితుడైతే..? ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పరువు గంగలో కలిసినట్టే.

 

తాజాగా టీవీ నటుడు, సింగర్ కరణ్ ఒబెరాయ్‌ విషయంలోనూ ఇలాగే జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని, తర్వాత రేప్ చేసి, ఆ వీడియోలతో తనను బెదిరిస్తున్నాడని ఓ మహిళ కరణ్ ఒబెరాయ్‌పై ఫిర్యాదు చేసింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. రేప్ ఆరోపణలతో కరణ్‌పై కేసు నమోదు కాగా.. మే 5న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

 

కానీ ఆయన మాత్రం తాను తప్పు చేయలేదని మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. తొలుత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడానికి కూడా నిరాకరించింది. మే 25న కరణ్ ఒబెరాయ్‌పై సదరు మహిళ రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ సందర్భంగా ఆమె తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలింది. రేప్ ఆరోపణలు తప్పని తేలడంతో.. బాంబే హైకోర్ట్ జూన్ 7న కరణ్‌కు బెయిల్ మంజూర్ చేసింది.

 

అనంతరం ముంబై పోలీసులు ఆ కిలేడీని అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెకు కూడా బెయిల్ మంజూరైంది. తప్పుడు ఆరోపణల కారణంగా అరెస్టయిన కరణ్ ఒబెరాయ్ మానసికంగా ఎంతో వేదన అనుభవించారు. రిష్టోన్ కా వ్యాపార్ (సంబంధాలతో వ్యాపారం) పేరిట తన బాధను, అనుభవించిన మానసిక వేదనను పాట రూపంలో తీసుకొచ్చారు. ఈ పాట రాయడంతోపాటు ఆయనే స్వయంగా ఆలపించారు. టైమ్స్ మ్యూజిక్‌ ఈ పాటను రిలీజ్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: