రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, 'వైట్ లాంబ్ పిక్చర్స్' వినోద్ కుమార్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 28న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ...

 

నా నటనకు మంచి పేరు వచ్చింది. నా లుక్స్, నా మేనరిజమ్స్ బాగున్నాయని ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నారు. కథ, నా క్యారెక్టర్, ప్రశాంత్ వర్మ టేకింగ్... అన్ని బాగున్నాయని అంటున్నారు. క్యారెక్టర్ పరంగా నేను డామినేట్ చేశానా? అండర్ ప్లే చేశానా? అనేది పక్కన పెడితే... ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఫైట్ బాగున్నాయని అందరూ చెబుతున్నారు. ముఖ్యంగా నా అభిమానులకు సినిమా చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరూ ఐదేసి సార్లు సినిమా చూస్తున్నారు.

 

సినిమాలో రెండుసార్లు 'ఏం సెప్తిరి ఏం సెప్తిరి' అనే డైలాగ్ చెప్తాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక రోజు వచ్చి సన్నివేశాన్ని వివరించారు. 'ప్రశాంత్! సన్నివేశాన్ని భలే రాశారే' అన్నాను. ఆ రోజు షూటింగ్ చేసేశాం. రెండోసారి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్‌కి వచ్చింది. తనతో ఆ డైలాగ్ గురించి చెప్పాను. 'ఇది మీ డైలాగే కదా!' అంది. (నవ్వుతూ) అప్పటివరకు నాకు అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు. కమర్షియల్ ట్రైలర్ విడుదల తర్వాత ఆ డైలాగ్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

 

నేను విలన్ అయితే తట్టుకోలేరు. అందుకని, భయపడుతున్నారేమో. ఉదాహరణకు... 'ధృవ'లో అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్ అయితే చేస్తా. రెగ్యులర్ విలన్ రోల్స్ చేయను. 'అరవింద సమేత వీరరాఘవ', 'శ్రీమంతుడు' చిత్రాల్లో జగపతిబాబు చేసిన పాత్రలు కూడా నచ్చాయి. అటువంటివి వచ్చినా చేస్తా. అంతేగాని రెగ్యులర్ విలన్ రోల్స్ ఛస్తే చేయను, ఎందుకంటే తరువాత జనాలు చూడలేక చావాలి అని నవ్వుతూ.. విలేకరులకు సమాధానం ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: