నచ్చని విషయాల గురించి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే కంగనా రనౌత్‌.. సాయం చేసే విషయంలో కూడా అలానే ఉంటానని నిరూపించుకున్నారు. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫేక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పానీ ఫౌండేషన్‌కు రూ. లక్ష విరాళం ఇచ్చారు కంగనా. ఈ విషయాన్ని కంగనా సోదరి రంగోలి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

 

‘కంగనా రూ. లక్ష, నేను రూ. 1000 పానీ ఫౌండేషన్‌కు విరాళం ఇచ్చాము. రైతులకు మీకు తోచినంత సాయం చేయండి. ఇది విరాళం కాదు. వారి పట్ల మనం చూపే కృతజ్ఞత. రైతుల శ్రమ వల్లనే ఈ రోజు మనం మూడుపూటలా తింటున్నాం. మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా.. రైతుల పట్ల కౄరంగా వ్యవహరించే బ్రిటీష్‌ విధానాలను, చట్టాలను మాత్రం మార్చలేదు.

 

భూమి పుత్రుల పట్ల మన కృతజ్ఞతను చాటుకోవడానికి ఇదే మంచి అవకాశం’ అంటూ ట్వీట్‌ చేయడమే కాక.. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్‌ చేశారు రంగోలి. గతేడాది కేరళలో వరద బీభత్సం సృష్టించినప్పుడు కూడా కంగనా ఇదే విధంగా స్పందించారు. మనం చేసే చిన్న సాయం కూడా కేరళవాసులకెంతో విలువైనది.. సాయం చేయడంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

 

ఇక పానీ ఫౌండేషన్‌ విషయానికోస్తే.. మహారాష్ట్రలో దేశంలో ఎక్కడా లేనంత నీళ్ళ కొరత ఉంది. ఎండాకాలం వస్తే పంటల సంగతి దేవుడెరుగు కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండవు. ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ ఇక్కడ పరిస్థితిని మార్చడం కోసం ‘పానీ ఫౌండేషన్‌’ని స్థాపించి కరువును తరిమికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: