సినిమాలకు వెళ్లే ఎవరైనా అందులోని హీరోలను చూసి స్ఫూర్తి పొందుతారు. కానీ... ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు మాత్రం విలన్‌నే ఎక్కువగా గుర్తు పెట్టుకున్నట్టున్నారు. వారు తాజాగా కనుగొన్న తేనెటీగ లాంటి ఓ ఈగ (బీ ఫ్లై)కు పాపులర్‌ టీవీ షో ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ ప్రతినాయకుడు ‘నైట్‌ కింగ్‌’ పేరు పెట్టారు. అలా ఎందుకని అడిగితే... ఊహాజనితమైన నైట్‌ కింగ్‌ పాత్ర ఆహార్యం, స్వభావానికీ... ఈ కొత్త ఈగకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెబుతున్నారు.

 

చూడ్డానికి తేనెటీగలా ఉన్నా... ఇది ఈగ జాతికి చెందిన కీటకం. అచ్చం ‘నైట్‌ కింగ్‌’ గెట్‌పలానే ఈ ఈగకు కూడా తలపై కొమ్ముల్లాంటి జుట్టు కిరీటంలా ఉంది. చలికాలంలో ఈ జీవి వృద్ధి చెందుతుంది. ఇది పరాన్నజీవి. ఆడ ఈగ తన గుడ్లను వేరే కీటకం వద్ద పెడుతుంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్లలు, పొదిగిన కీటకాన్ని తినేస్తాయి. పక్షులు తినకుండా తమను తాము రక్షించుకొనేందుకు తేనెటీగల్లా సంచరిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

 

తేనెటీగల్లా వీటికీ పొడవాటి ముక్కు ఉంటుంది. దాని ద్వారా పువ్వుల్లోని మకరందాన్ని ఆస్వాదిస్తాయి. ‘కామన్‌వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌’ (సీఎ్‌సఐఆర్‌ఓ) ఆస్ర్టేలియాలో కనుగొంది. పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు దానికి ఇలా ఆసక్తికరంగా ‘పారామొనోవియస్‌ నైట్‌ కింగ్‌’ పేరు పెట్టారు. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’కు వీరాభిమాని అయిన సీఎస్‌ఆర్‌ఓ పరిశోధక విద్యార్థి జువాన్‌కున్‌ లీ మొదట ఈ పేరును ప్రతిపాదించాడు.

 

‘నైట్‌ కింగ్‌’కూ... ఈ కీటకానికి సారూప్యం ఉండటంతో శాస్త్రవేత్తల బృందం అతడి సూచనను పరిగణనలోకి తీసుకుంది. ఆస్ర్టేలియాతో పాటు ఉత్తర అమెరికా, యూరప్‌, ఆసియా ఖండాల్లో కూడా ‘పారామొనోవియస్‌ నైట్‌ కింగ్‌’ ఈగల సంచారం ఉంది. గత సంవత్సర కాలంలో సీఎ్‌సఐఆర్‌ఓ 230 జాతులకు నామకరణం చేసింది. మరి త్వరలో ఇంకొన్ని కొత్త జాతుల్ని కనిపెడితే... వాటికి ఏ హీరో, విలన్ల పేర్లు పెడతారో చూడాలి!


మరింత సమాచారం తెలుసుకోండి: