ఎస్వీయార్ అంటే ఆ తరానికి ఓ మైమరుపు. ఓ తీపి గురుతు. ఈ తరానికి ఆయన బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో  కనిపించే  కీచకుడు. అరవీర భయంకరుడు. పాతాళ భైరవిలో బేతాళ మాంత్రికుడు. ఎస్వీయార్ నటనను వర్ణించే కలం లేదు. చూసే కనులకు అనుభూతిని అస్వాదించడం తప్ప ఆయన ప్రతిభా పాటవాలు ఎంచి వివరించే తాహతు లేదు.


ఈ రోజు ఎస్వేయార్ వందవ పుట్టిన రోజు. మరణించారు  కాబట్టి జయంతి అంటారు. కానీ ఆయన అన్నిటికీ అతీతుడు. కీర్తి కాయంతో దేదీప్యమానంగా వెలిగే గొప్ప నటుడు. సామర్ల  వెంకట రంగారావు. ఆయన పుట్టింది వందేళ్ల క్రితం అంటే  1918 జూలై 3వ తేదీన. ఆయన 1974లో ఇదే జూలై నెల 18న  మరణించారు. అంటే 56 ఏళ్ళ వయసులో అన్న మాట. ఇపుడున్న రోజుల్లో చూసుకుంటే చాలా చిన్న వయసులోనే చనిపొయారనుకోవాలి.


ఆయన 1947లో తన నట జీవితాన్ని ప్రారంభించారు 1974 వరకూ అంటే 27 ఏళ్ల పాటు నిరాటంకంగా తన నటనా వైదుష్యంతో అందరినీ అలరించారు. నర్తలశాలలో కీచకుని పాత్ర పోషణలో ఎస్వీయార్ అదుర్స్ అనిపించారు. జకర్తా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆ చిత్రం ప్రదర్శించబడింది. ఇక నేపాల మంత్రికుడిగా పాతాళ భైరవి నటనకు కూడా అవార్డులు అందుకున్నారు.


తొలి సినిమా వరూధినిలో కధానాయకునిగా చిత్ర సీమలో ప్రవేశించిన  ఎస్వీయార్ నటునిగా తన సత్తా చాటుకున్నారు. ఆయన అనార్కలిలో  అక్షర్ పాదుషాగా, ఉషాపరిణయం లో బాణాసురుడిగా, బాల భారతం లో భీష్మునిగా, మహాకవి కాళిదాస్ లో భోజ రాజుగా, దక్ష యగ్నంలో దక్షునిగా, మాయాబజార్ లో ఘటోత్కచునిగా, భక్త ప్రహాదలో హిరణ్య కశిపునిగా, యశోదా క్రిష్ణ, క్రిష్ణ లీలలు లో కంశునిగా, భూకైలాస్ లో మాయాసురునిగా అద్భుతమైన నటన కనబరచారు.


ఎస్వీయార్ వంటి నటుడు తెలుగు సీమ‌లో పుట్టడం మన అద్రుష్టం. ఆయన ఏ ఇతర భాషల్లో పుట్టినా కూడా ఎనలేని పేరు ప్రఖ్యాతులు లభించేవి. అసమాన ప్రతిభా ప్రవీణుడు ఎస్వీయార్ ఈ భువి ఉన్నంతవరకూ తన కీర్తి చంద్రికలతో అలా వెలుగుతూనే ఉంటారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: