సెలెబ్రిటీలు ఏది చేసినా క్షణాల్లో జనాలకి తెలిసిపోతుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. గోప్యత అనేది లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితిలో సెలెబ్రిటీలు ఏది దాచాలనుకున్నా దాగదు. సెలెబ్రిటీల జీవితాల మీద జనాలకి ఆసక్తి ఎక్కువ ఉండటం సహజం. మొన్న తమిళ నటుడు విశాల్ కోర్టుకు హాజరు కావడం ఆశ్చర్యాన్ని రెకెత్తించింది.


సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించని కేసుకు సంబంధించి కేసులో ఆయన కోర్టుకు వచ్చారు. అయితే విశాల్‌ రూ.కోటి వరకు సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించలేదని ఆదాయపన్ను శాఖ 2016 నుంచి 2018 వరకు ఐదుసార్లు సమన్లు జారీ చేసింది. అయినా విశాల్‌ ఒక్కసారి కూడా నేరుగా హాజరు కాలేదు. ఆయన తరపున ఆడిటర్‌ మాత్రమే హాజరయ్యారు. ఇందువల్ల ఆదాయపన్ను శాఖ విచారణకు నేరుగా హాజరు కావాలని చెన్నై ఎగ్మూర్‌ కోర్డులో కేసు దాఖలు చేసింది. దీంతో ఆయన ఈరోజు న్యాయస్థానం హాజరయ్యారు.


ఇరుతరపు వాదనలు విన్న అనంతరం ఈ కేసు విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. విశాల్ ప్రస్తుతం నడిగర్ సంఘం ఎన్నికల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నడిగర్ సంఘం కార్యదర్శిగా కొనసాగుతున్న విశాల్ నేతృత్వంలోని టీంను ఓడించేందుకు.... భాగ్యరాజా నేతృత్వంలోని టీం బలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భాగ్యరాజా టీంకు మద్దతు ఇస్తున్న తమిళ దర్శకుడు భారతీ రాజా విశాల్ మీద సంచలన ఆరోపణలు చేసారు.


నడిగర్ సంఘం తమిళులు కాని వ్యక్తుల చేతుల్లో ఉందని, ఇలాంటి పరిస్థితి ఉండటం చాలా బాధగా ఉందని, భాగ్యరాజా నేతృత్వంలోని టీంను గెలిపించుకోవడం ద్వారా తమిళ నటుల ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ భారతీరాజా వ్యాఖ్యానించారు. మరి సర్వీస్ టాక్స్ చెల్లించలేదనే విషయం ప్రత్యర్థులకు మరో అవకాశంగా మారనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: