సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్ కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'కబీర్ సింగ్'.  తెలుగులో సంచలన విజయం నమోదుచేసిన 'అర్జున్ రెడ్డి' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ 'కబీర్ సింగ్' హిందీలో మరింత పెద్ద విజయాన్ని సాధించింది.  'అర్జున్ రెడ్డి' లైఫ్ టైమ్ కలెక్షన్లను మొదటి వారంలోనే దాటేసిన ఈ సినిమా తాజాగా రూ. 200 కోట్ల మార్కును దాటింది. 

 

ఈ బుధవారం వరకూ ఇండియా లో 'కబీర్ సింగ్' రూ. 206.48 కోట్లు సాధించిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.  దీనికి ఆయన 'కబీర్ సింగ్ 200 నాట్ అవుట్.. బాక్స్ ఆఫీస్ దగ్గర డబల్ సెంచరీ కొట్టాడు.. అయితే అలసిపోయినట్టు కనినిపించడం లేదు' అంటూ క్రికెట్ స్టైల్ లో క్యాప్షన్ ఇచ్చారు.

 

అంతే కాదు ఈ ఏడాది రూ. 200 కోట్ల మార్కును అతి త్వరగా చేరుకున్న చిత్రం 'కబీర్ సింగ్' అంటూ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.  విక్కీ కౌశల్ 'ఉరి' 28 రోజుల్లో ఈ మార్కును చేరుకోగా.. సల్మాన్ ఖాన్ 'భారత్' కు 14 రోజులు పట్టింది. అదే 'కబీర్ సింగ్' 13 రోజుల్లోనే 200 కోట్ల మార్కును చేరుకోవడం గమనించాల్సిన విషయం. ఇప్పటికీ ఈ సినిమా జోరు తగ్గకపోవడం చూస్తుంటే 'కబీర్ సింగ్' ఫైనల్ కలెక్షన్స్ 250 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి.

 

కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ దుమ్మెత్తిపోసినా ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కడం నిజంగానే గొప్ప విషయం.  క్రిటిక్స్ అందరూ ఈ సినిమా ను విమర్శించలేదు.. తరణ్ ఆదర్శ్ లాంటి వారు మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని  రిలీజ్ అయిన మొదటి రోజే తేల్చారు.  ఈ సినిమా షాహిద్ కపూర్ కెరీర్ లో బిగ్గెస్ట్ సోలో హిట్ గా నిలవడమే కాకుండా సందీప్ వంగాకు బెస్ట్ బాలీవుడ్ డెబ్యూ గా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: