"పువ్వు పుట్టగానే పరిమళిస్తుంద'నే నానుడి అతి పురాతనమైనదే కావొచ్చు. కానీ దానిని వాడే సందర్భం మాత్రం అత్యంత అరుదుగా.. 'లీలా మానసి' వంటి చిచ్చర పిడుగుల గురించి, వండర్ కిడ్స్ గురించి రాయాల్సివచ్చినప్పుడు మాత్రమే అది అక్కరకు వస్తుంది. 
     ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్న లీలా మానసి ఇప్పటికే 'సూర్యవంశం' అనే టీవీ సీరియల్ లో నటించి, మెప్పించి 'సింగిల్ టేక్ వండర్ కిడ్'గా పేరు సంపాదించుకుంది. 'ప్రేమకథ' అనే చిత్రానికి డబ్బింగ్ చెప్పింది. తాజాగా మరో సీరియల్ కీ సై చెప్పింది. సినిమా అవకాశాలు సైతం వెతుక్కుంటూ వస్తున్నాయి. తగిన ఛాన్స్ రావాలె కానీ తన తడాఖా చూపిస్తానని ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతుండగా చెబుతోంది లీలా మానసి. 


      నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకుంటూ, తన ప్రదర్శనలతో అందరినీ అచ్చెరువు పరుస్తున్న మానసి..  గానం, చిత్ర లేఖనం విషయాలకొస్తే చిచ్చర పిడుగేనని చెప్పొచ్చు. ఈ వయసులోనే డ్రెస్సులు, ఇయర్ రింగ్స్  సైతం అద్భుతంగా డిజైన్ చేస్తుందంటే దాన్ని బట్టి లీలా మానసి ప్రతిభను అంచనా వేయొచ్చు. తన ప్రతిభ వెనుక.. ఉద్యోగరీత్యా తాశీల్దార్ అయిన తన తల్లి మాధవి ప్రోత్సాహం ఎంతైనా ఉందని మానసి చెబుతుంది. 


       అయితే ఉద్యోగరీత్యా కరకుగా వ్యవహరించినా... స్వతహా మృదు స్వభావురాలైన మాధవి మాత్రం.. ఇదంతా పూర్వజన్మ సుకృతం అంటారు. 'నాలుగేళ్ల వయసు నుంచే మానసి ప్రతిభ మాకు అర్ధమవుతూ వచ్చింది. ఒకమ్మాయి ఇన్ని కళా రూపాల పట్ల మక్కువ పెంచుకోవడం, రోజుల వ్యవధిలో అవగాహన చేసుకొని, అసాధారణ రీతిలో ప్రతిభను కనబరుస్తూ ఉండడం మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. చదువు పాడవుతుందేమోనని.. తనను నిరుత్సాహ పరచడం మాకిష్టం లేదు. కళారంగాల్లో విశేషంగా రాణించేవాళ్ళు.. చదువులోనూ బ్రహ్మాండంగా రాణిస్తారని నా నమ్మకం" అంటారు జర్నలిజం, న్యాయ శాస్త్రం, బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీలు కలిగి ఉండడంతో పాటు స్వతహా తాను కూడా పెన్సిల్ స్కెచ్ లో సిద్ధహస్తురాలై.. సాహిత్యాభిలాష మెండుగా కలిగి.. తాశీల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బహుముఖ ప్రతిభాశాలి మాధవి!!


మరింత సమాచారం తెలుసుకోండి: