ఒక సెల్‌ఫోన్‌లో రెండు సిమ్‌ కార్డులు ఉన్నట్టే, ఒక వ్యక్తికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి ‘బుర్ర కథ’ పుట్టింద’’న్నారు డైమండ్‌ రత్నబాబు. పలు చిత్రాలకు రచయితగా పనిచేసి, ‘బుర్రకథ’తో దర్శకుడిగా అవతారం ఎత్తారు. ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలివి!

 

రెండు మెదళ్లతో పుట్టిన వాళ్ల గురించి ఇంటర్నెట్‌లో నేను అన్వేషించాను. ప్రపంచంలో అలాంటివాళ్లు దాదాపుగా పదహారు మంది ఉన్నార్ట. అయితే వాళ్లంతా ఇప్పుడు బతికిలేరు. నిజంగా ఎవరైనా బతికుంటే ఎలా ఉంటుందన్న ఊహకు తెర రూపమే ‘బుర్ర కథ’. ఓ ఇంట్లో ఇద్దరు అబ్బాయిలుంటే ఒకరు క్లాస్‌, మరొకరు మాస్‌గా మారిపోతారు. కానీ ఆ రెండు లక్షణాలూ అభిరామ్‌లో ఉంటాయి. అదే ఈ కథ.

 

చిన్నప్పటి నుంచి కవితలు రాసే అలవాటు ఉంది. ‘డైమండ్‌’ అనే కలం పేరుతో రాసేవాడ్ని. అలా అది నా ఇంటి పేరు అయిపోయింది.  ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘ఆడోరకం ఈడోరకం’, ‘గాయత్రి’ చిత్రాలకు సహాయకుడిగా పనిచేశాను. ఎప్పటికైనా దర్శకుడ్ని అవ్వాలనుకున్నాను. అందుకే చేతిపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాను.

 

దర్శకుడిగా నాకు దాసరి నారాయణరావు ఆదర్శం. దర్శకులకు గౌరవం తెచ్చారాయన. రచయిత దర్శకుడైతే కొన్ని సౌలభ్యాలు ఉంటాయి. కాకపోతే.. ఏ డైలాగ్‌ ఎంత వాడుకోవాలో తెలిసుండాలి. రచయిత, దర్శకుడు.. రెండు విభాగాల్లోనూ కొనసాగుతుతాను. ఇప్పటికే అయిదుగురు నిర్మాతలకు కథలు చెప్పాను. అందులో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. నాలుగు చిత్రాలకు కథారచయితగా పనిచేస్తా.. అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: