సినీ ఛాన్సులు .. ఆడిషన్స్ అంటూ హడావుడి చేస్తూ దొరికినంతా దోచేస్తున్నారు కొందరు మోసగాళ్లు. అమాయక యువతీ యువకుల జేబులు ఖాళీ చేస్తున్న దర్జా దొంగలు పోలీసులకు చిక్కుతున్న ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. రీసెంట్ గానే సీరియల్స్ లో ఛాన్సులిప్పిస్తానంటూ తుమ్మల శ్రీదేవి అనే యువతి మోసం బట్టబయలైన సంగతిని మరువక ముందే మరో మోసం వెలుగులోకి వచ్చింది.

 

సినిమాల్లో  ఛాన్స్ పేరుతో ఓ వ్యక్తి వరుస మోసాలకు పాల్పడి లక్షల్లో సొమ్ములు వసూలు చేస్తున్నాడు. ఇప్పటికే పలువురిని మోసం చేసిన సదరు వ్యక్తిపై తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సదుం మండలం బయారెడ్డిపల్లెకు చెందిన చిట్టి పవన్ కల్యాణ్ డిగ్రీ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని వాట్సాప్ నంబరు ద్వారా హైదరాబాద్ కు చెందిన నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఛైర్మన్ ను అంటూ ఎస్.వి.ఎన్.రావ్ పరిచయం చేసుకున్నాడు.

 

ఆ ఇద్దరూ కలిసి ఓ తెలివైన గేమ్ ప్లాన్ చేశారు. సినీఛాన్స్ కోసం పడి చచ్చే యువతీ యువకులను ఆహ్వానించి తిరుపతి- కరకంబాడి రోడ్డులో 2018 నవంబరులో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. సినిమాల్లో ఛాన్సులు పేరుతో వారి వద్దనుంచి సభ్యత్వం ఇన్సూరెన్స్ అంటూ నమ్మ బలికారు. ఆ క్రమంలోనే చిట్టి పవన్ కల్యాణ్- బి.భాను- డి.సురేష్-ఎన్.రాజు తదితర యువకుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల చొప్పున స్థానిక టౌన్క్లబ్ వద్ద వసూలు చేసి సభ్యత్వం కార్డును అందించాడు.

 

అయితే తమకు అవకాశం వస్తుందని ఎదురు చూసిన యువకులకు అతడు తప్పించుకుని తిరుగుతుండడంతో మోసపోయామని గ్రహించారు. అటుపై తిరుపతి వెస్ట్ పోలీసుల్ని ఆశ్రయించారు.  బాధితుల ఫిర్యాదుపై కేసును నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నగదు ఇచ్చి మోసపోయామనే కేసు ఇదే పోలీస్ స్టేషన్ లో నమోదు కావడం విశేషం. త్వరలోనే మోసగాళ్లను పట్టుకుంటామని పోలీసులు భరోసానిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: