మా నాన్నగారు సినిమా రచయిత అవుదామని ప్రయత్నించారు. ఆయన అవ్వలేకపోయారు. ఎప్పుడూ ఫీలవుతూనే ఉండేవారు. ఆ విషయం నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేనైనా అవ్వాలనుకునేవాణ్ని. అలా బీజం ఏర్పడిందనుకుంటా. ఈ ఫాదర్స్‌ డే సందర్భంగా నేను దర్శకుడిని అవ్వడం నాకు గర్వంగా ఉంది. ఈ బుర్రకథ కూడా తండ్రీకొడుకుల మధ్య కథ. హారు ఫ్రెండ్‌ అంటూ ఒకరినొకరు పలుకరించుకునే కాన్సెప్ట్‌.. అని డైమండ్‌ రత్నబాబు అన్నారు.

 

రచయితగా ఎన్ని సినిమాలకు పని చేసినా దర్శకుడు అవ్వాలనే కోరిక లోపల అలాగే ఉంది. ఆ కోరికతోనే నేను డైరెక్ట్‌ చేయడానికి నాలుగైదు కథలు రాసుకున్నా. వాటిలోని ఒకటే ఈ 'బుర్రకథ'. ఒక వ్యక్తికి రెండు బుర్రలు ఉంటే ఎలా ఉంటుందనేది సినిమా కథ. ఫోన్‌లో రెండు సిమ్ములు ఉన్నట్లు.. ఒకే మనిషిలో రెండు బుర్రలు ఉంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించాం.

 

నాకు జీవితమే పెద్ద గురువు. టెన్త్‌క్లాస్‌లో బందరులో పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తుండగా ఎందరినో స్టడీచేశా. బాబారు, బ్రో.. అని పిలుస్తూ 100 రూపాయల పెట్రోల్‌ కొట్టు అంటూ చాలామంది చాలా రకాలుగా పిలుస్తుండేవారు. దానివల్ల ప్రతి మనిషినీ చదివాను. ఆ క్యారెక్టర్లే ఈ సినిమాలో కొందరికి పెట్టాను.

పిల్లల గురించి ఏ విషయమైనా తండ్రికి మూడో వ్యక్తి ద్వారా కాకుండా నేరుగా తెలిస్తే మంచిది. ఫాదర్‌ ఫ్రెండ్లీగా ఉంటే తప్పు చేసేందుకు అవకాశం రాదు.

 

ఫ్రెండ్‌ అనేవాడు అన్నింటిలో తోడుండాలి. అదే ఫాదర్‌ అయితే ఎలా ఉంటుందనేది కథలో చూపించాం. ప్రపంచంలో 16మంది ఇలాంటి వ్యక్తులున్నారు. కొందరు చిన్న వయస్సులోనే చనిపోయారు. వాళ్లు హ్యాపీగా బతికుంటే ఎలా ఉంటుందనేది కథ. హలో బ్రదర్‌ సినిమాలో ఇద్దరు నాగార్జునలు ఉండడాన్ని చూశారు. ఇందులో ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడిలోనే ఇద్దరుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: