పాఠశాల రోజుల్లోనే ఎప్పటికైనా సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకొన్నా. ఆ రకంగా నేను కథానాయికని కావడానికి మా నాన్న స్ఫూర్తిగా నిలిచార’’న్నారు శివాత్మిక. ప్రముఖ నటులు రాజశేఖర్‌, జీవితల తనయ శివాత్మిక. ‘దొరసాని’ చిత్రంతో తెరకు పరిచయమవుతోంది. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కె.వి.ఆర్‌.మహేంద్ర దర్శకత్వం వహించారు. ఈ నెల 12న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా శివాత్మిక శనివారం మీడియాతో పంచుకున్న ముచ్చటలివి...

 

తల్లిదండ్రుల నట వారసత్వం అందిపుచ్చుకొని సినీ రంగ ప్రవేశం చేశా. వారసత్వం బాధ్యతని పెంచుతుందే తప్ప అది బరువుగా భావించి ఎప్పుడూ ఒత్తిడికి గురికాలేదు. ఆడిషన్స్‌ తర్వాతే ఈ చిత్రం కోసం నన్ను ఎంపిక చేశారు. 1980ల కాలంలో తెలంగాణలోని ఓ ప్రాంతం నేపథ్యంలో సాగే ఓ యథార్థ ప్రేమకథగా దీన్ని రూపొందించారు. నేను ఆ ప్రాంతం దొర కూతురు దేవకిగా కనిపిస్తా.

 

ఇది చాలా సహజమైన ప్రేమకథ. మొత్తం స్క్రిప్ట్‌లో నా డైలాగ్‌లు పదికి మించి ఉండవు. ఎక్కువగా కళ్లతోనే భావాలను పలికించాల్సి వచ్చింది. నా దృష్టిలో మహేంద్రను తెలుగు సంజయ్‌ లీలా భన్సాలీ అని చెప్పొచ్చు. కథను ఎంత వాస్తవికంగా రాశారో... అంతే నిజాయితీగా తెరపైకి తీసుకొచ్చారు. నటనలో ఎవరినీ అనుకరించే ప్రయత్నం   చేయలేదు.

 

నా చిన్నతనం అంతా నాన్న సెట్స్‌లోనే గడిచింది. కాబట్టి ఆ వాతావరణం కొత్తగా ఏమీ అనిపించలేదు. కానీ, తొలిసారి కెమెరా ముందుకి వెళ్లిన క్షణాలు  ఆసక్తికరంగా అనిపించాయి. ఆనంద్‌ దేవరకొండతో తెర పంచుకోవడం సంతోషంగా ఉంది. సెట్లోకి వెళ్లిన కొద్దిరోజుల్లోనే ఇద్దరం మంచి స్నేహితులైపోయాం. రాజు పాత్రలో ఉన్న అమాయకత్వం ఆనంద్‌లో సహజంగానే ఉంది. ప్రస్తుతానికి నా దృష్టంతా ‘దొరసాని’పైనే. కొత్తగా నాలుగు కథలు చర్చల దశలో ఉన్నాయి. మా కుటుంబమంతా కలిసి ఓ సినిమా చేయాలనే ఆలోచన ఉంది. దర్శకత్వం వైపు వెళ్లాలని లేదు. అని తన అభిమతాన్ని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: