టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్, డ్రగ్స్ మాఫియా నుంచి మొదలు పెడితే చాలా చెడు కోణాలు ఇండస్ట్రీలో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరో చెడు సంస్కృతి మొదలవుతోందని టాక్. పైకి ఓ మంచి ఆశయంలా కనిపించే ఆ కల్చర్, లోపల చాలా పాశవికంగా మారుతోంది. అదే క్రౌడ్ ఫండింగ్. మంచి కథ.. దాన్ని తీసే డైరక్టర్, నటించే నటులు అందుబాటులో ఉన్నప్పటికి అలాంటి కథను తెరపైకి తీసుకొచ్చే సాహసం చేయలేరు నిర్మాతలు. అందుకే ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ అనే కాన్సెప్ట్ మొదలైంది. ముగ్గురు, నలుగురు కలిసి తలా కొంత డబ్బు వేసుకొని అనుకున్న సినిమాను పూర్తిచేస్తారు. లాభాల్లో వాటలు పంచుకుంటారు..ఒకవేళ నష్టం వచ్చినా ఒక్కరు భరించాల్సిన పరిస్థితి ఉండదు. 

కానీ ఇప్పుడీ క్రౌడ్ ఫండింగ్ లోకి బ్లాక్ మనీ ప్రవాహం ఎక్కువైపోయిందని తెలుస్తోంది. కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఎక్కువమంది బినామీ పేర్లతో క్రౌడ్ ఫండింగ్ వైపు మళ్లుతున్నారు. నిజానికి సినిమాల్లోకి బ్లాక్ మనీ ప్రవాహం అనేది కొత్తదేంకాదు. దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. కానీ ఒకప్పుడు ఒక సినిమాతో ఒకరు మాత్రమే ఇలాంటి చట్టవ్యతిరేక పనులు చేసేవారు. కానీ క్రౌడ్ ఫండింగ్ వచ్చిన తర్వాత ఒకే సినిమాతో ముగ్గురు నలుగురు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. 

వీళ్లలో వ్యాపారవేత్తలతో పాటు రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే.. మంచి కథ దొరికితే క్రౌడ్ ఫండింగ్ చేద్దాం అనేవాళ్లు కనిపించడం లేదు. బ్లాక్ మనీ ఉంటే క్రౌడ్ ఫండింగ్ లో ఏదో ఒక సినిమా చేద్దాం అనే బాపతు ఎక్కువయ్యారు. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఒకవేళ ఇదే గనక కంటిన్యూ అయితే ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా అయిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: