తెలుగు జర్నలిజంలో పాలిటిక్స్‌, సినిమాలు మీద కాస్త కళాపోషణతో సున్నితమైన సెటైర్‌తో రాయగలిగిన రచయత భరద్వాజ రంగావజుల. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న అరుదైన మార్పు పై తనదైన శైలిలో ఇలా వ్యాఖ్యానించారు.

'' ఈ మధ్య తెలుగు సినిమాకు ఏదో అయ్యింది.. లేక పోతే ఇలా వరుసగా తలాతోక ఉన్న సినిమాలు రావడం ఏమిటి? మరీ గొప్ప సినిమాలని చెప్పలేంగానీ ... దాదాపు నెల రోజులుగా నోరారా తిడదామనే సినిమాలు రాకపోవడం మాత్రం శోచనీయమే. రాజశేఖర్‌ కల్కి సినిమా సైతం పర్లేదనిపించేలా నడిచింది. అదే రోజు విడుదలైన బ్రోచేవారెవరురా సినిమా అయితే వావ్‌ ..!!

కల్కి సినిమా పరమ పాత సినిమాను తీసుకుని స్క్రీన్‌ ప్లే కాస్త కొత్తగా నడిపి సినిమాను గట్టెక్కిస్తే ... బ్రోచేవారెవరురా స్క్రీన్‌ ప్లే మీదే ఆధారపడి నడిచింది. ఇక ఈ సందట్లోనే విడుదలైన ఏజంట్‌ శ్రీనివాస ఆత్రేయ కూడా కొత్తకొత్తగానే కొత్త పాయింటు చుట్టూ బాగానే నడిపాడు. ఇందులో నటించిన హీరో పాత్రధారి అలాగే హీరోయిన్‌ అనదగ్గ పాత్రలో కనిపించిన టిక్‌ టాక్‌ శ్రుతిశర్మ ఇద్దరూ చాలా బాగా నటించేశారు కూడా...

ఇక మొన్నటికి మొన్న వచ్చిన ' ఓ బేబీ ' అయినా పరమ దరిద్రంగా ఉంటుందనుకున్నాగానీ అది కూడా పర్లేదనిపించేసింది. కాకపోతే ఆ జగపతిబాబే బాగా ఇరిట్టేట్‌ చేసాడు ... నిజంగానే దేవుడింతే... అనిపించేలా ఉంది అతని నటన. ఒక్క బుర్రకథ ఒక్కటే కాస్త మన అంచనాలకు అందుతూ చెత్తగా నడిపిన సినిమా ... సీనియర్‌ నటుడు సాయి కుమార్‌ కొడుకు కాబట్టి అతను మన కోసం ఈ చెత్త సినిమా చేశాడు హాయిగా...

ఇలా వరసగా ఓ మోస్తరుగా బావున్న సినిమాలు వచ్చేస్తే ... ఏమైపోవాలి ఇండస్ట్రీ ...? అసలిలా మంచి సినిమాలు రావడం అనే దిక్కుమాలిన వ్యవహారం మల్లేశం సినిమా నుంచీ ప్రారంభమైనట్టుందని నాకో పెద్ద అనుమానం ...
మళ్లీ ఎప్పుడు వరసగా తిట్టుకునే సినిమాలు తీస్తారో ఏమిటో ..?'' 


మరింత సమాచారం తెలుసుకోండి: