దక్షిణ భారత సినీ రంగంపై తనదైన ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్. కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్  1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించాడు. తొలుత అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో పనిచేసేవాడు. అక్కడ ఉద్యోగం చేస్తూనే పలు నాటకాలు రాశాడు.  తమిళుడైనప్పటికీ తన చిత్రాల ద్వారా తెలుగు వారికి చేరువయ్యారు. ఆకలి రాజ్యం, రుద్రవీణ తదితర చిత్రాల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు.


దర్శకత్వానికి ముందు ఎంజీఆర్‌ హీరోగా నటించిన దైవతాయ్‌ చిత్రానికి సంభాషణల రచయితగా చలనచిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించాడు. 45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించాడు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశాడు. భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డు కింద స్వర్ణకమలం, రూ.10లక్షల నగదు, శాలువాతో సత్కరించారు.


 బాలచందర్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారు.. డైరెక్టర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఆయన సినీ రంగానికి సేవ చేశారు. హీరోయిజానికి బదులు సామాజిక సమస్యలు, మానవ సంబంధాల సంఘర్షణలను ఆయన తన చిత్రాల్లో చూపించారు. అందుకు రుద్రవీణ, ఆకలి రాజ్యం చిత్రాలే నిదర్శనం. అప్పట్లో ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీలు ఎదుర్కొనే బాధలు ఆయన కథల్ని బాగా ప్రభావితం చేశాయి. అలా వెలుగులోకి వచ్చినవే సుజాత నటించిన అంతులేని కథ, సుహాసిని ప్రధాన పాత్రలో వచ్చిన సింధుభైరవి, ప్రమీలతో తీసిన అరంగేట్రం. సింధుభైరవిలో మగవాడి సహాయం లేకుండా బ్రతకాలనుకునే పాత్ర సుహాసిని ది.


అరంగేట్రంలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కుటుంబాన్ని పోషించడం కోసం వేశ్యావృత్తిని స్వీకరిస్తుంది. అప్పటి సమాజంలో ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసేవారు కావడంతో ఈ కథలు వివాదాస్పదం అయ్యేవి. అంతేకాదు అప్పట్లో వచ్చే సినిమాల్లో విషాదాంతాలు ఉండేవి కావు. చాలావరకు పెళ్ళితో అంతమయ్యేవే. కానీ ఆయన సినిమాలు అందుకు భిన్నంగా ఉండేవి.


తర్వాత సంగీతం ఉన్నవారికే కాదు..సామాన్యులకు కూడా అన్న మెసేజ్ తో  చిరంజీవి, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రవీణ గ్రామాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్న ఓ యువకుడి కథ. దీనికి ఆయన ఆ చిత్ర నిర్మాత నాగేంద్రబాబుతో కలిసి ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు. కమల్ హాసన్, సరిత నటించిన మరో చరిత్ర అప్పట్లో యువతను బాగా ఆకట్టుకున్న విషాదాంత ప్రేమకథ.

మరింత సమాచారం తెలుసుకోండి: