తెలుగు ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా హిందీలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓవైపు సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే బాలీవుడ్ విమర్శకులు, సినీ ప్రముఖులు మాత్రం ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాదికి చెందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అక్కడ నిలదొక్కుకోవడానికి ఇష్టపడకే ఈ విమర్శలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 


ఈ విమర్శల నేపథ్యంలో సందీప్ రెడ్డి కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రేమికులు ఒకరిని ఒకరు చెంపపై కొట్టుకోకపోతే, అడ్వాంటేజ్ తీసుకోకపోతే వారి మధ్య ప్రేమ ఎక్కడ ఉన్నట్టని ప్రశ్నించారు. ఇలా ప్రవర్తించని మహిళలు అసలు ఇప్పటి వరకు అసలుసిసలైన ప్రేమను ఆస్వాదించి ఉండరని వ్యాఖ్యానించారు. దీంతో సందీప్‌పై సమంత, చిన్మయి, అనసూయ లాంటి మన టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అసహనం వ్యక్తం చేశారు. 


అయితే, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అక్క రంగోలి రనౌత్ మాత్రం సందీప్ రెడ్డికి అండగా నిలిచారు. అసలు ప్రియురాలిని కొట్టడం, ఆమెతో మోటుగా సరసమాడటం వంటివి అప్పుడెప్పుడో రాజ్ కపూర్ సినిమాలోనే జరిగాయని గుర్తుచేశారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేసిన రంగోలి.. ‘రాజ్ కపూర్ అత్యంత శృంగారభరితమైన, మొరటైన సన్నివేశం ఇది. అసలు సిసలైన బాలీవుడ్ రూపం ఇది. కాబట్టి రాజ్ కపూర్‌ను దిగ్గజంగా పరిగణించే మీరు ఒక దక్షిణాది దర్శకుడి పట్ల ఇలా ప్రవర్తించడం మానండి’ అంటూ ఘాటుగా పేర్కొన్నారు. అంతేకాదు, రాజ్ కపూర్ ఆ మోటు సరసం వీడియోను ట్వీట్ చేశారు. 


1951లో రాజ్ కపూర్ హీరోగా వచ్చిన ‘ఆవారా’ సినిమాలోనిది ఈ సన్నివేశం. హీరోయిన్ నర్గీస్.. రాజ్ కపూర్‌ను అడవి మనిషి (జంగ్లీ) అని అనడంతో ఆగ్రహానికి లోనవుతాడు. హీరోయిన్‌ను పరుగులెత్తించి చేయి మెలితిప్పి గుండెలకు హత్తుకుంటాడు. చెంపలు చెల్లు చెల్లుమనిపిస్తాడు. ఆ వెంటనే అతను కోపంగా వెళ్తుంటే హీరోయిన్ ఏడుస్తూ అతని కాలు పట్టుకుని ఆపుతుంది. ఇదంతా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమతో జరిగిందే. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. మొదటి ‘కబీర్ సింగ్’ రాజ్ కపూర్ అంటూ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ రంగోలి విమర్శకులను కడిగిపారేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: