సినిమాకి సంగీతం ప్రాణం. సినిమా జయాపజయాలు సగం సంగీతం మీదే ఆధారపడతాయి. సీన్ హైలైట్ అవ్వాలన్నా.. పాటలు బాగుండాలన్నా మంచి సంగీతం ముఖ్యం. ఇందుకు మ్యూజిక్ డైరెక్టర్ కి మంచి మ్యూజిక్ సెన్స్ అవసరం. అలాంటి లక్షణాలతో ఉత్తుంగ తరంగంలా వచ్చిన సంగీత దర్శకుడు మణిశర్మ. మెలోడీ బ్రహ్మగా ఇండస్ట్రీలో పేరు గడించిన మణిశర్మ జన్మదినం నేడు. ఈ సందర్భంగా.. కొంచెం క్లుప్తంగా..

 

1992లో రాత్రి సినిమాతో మణిశర్మని సంగీత దర్శకుడిగా రాంగోపాల్ వర్మ పరిచయం చేశాడు. తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. మళ్లీ వర్మే.. 1996లో అశ్వనీదత్ ప్రొడక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసి మణికి అవకాశం ఇచ్చాడు. రెండు పాటలు షూటింగ్ జరిగాక ఆ సినిమా ఆగిపోయింది. మణిశర్మ టాలెంట్ గుర్తించిన చిరంజీవి 1998లో తన బావగారు.. బాగున్నారా సినిమాలో అవకాశం ఇచ్చాడు. మంచి మెలోడీస్ తో మెగాస్టార్ రేంజ్ కు తగ్గ మ్యూజిక్ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే మణి మ్యూజిక్ తో ఏవీఎస్ డైరెక్షన్ లో సూపర్ హీరోస్ ఆ ఏడాది ముందు రిలీజ్ అయింది. అదే ఏడాది చిరంజీవి చూడాలని ఉంది తో మణిశర్మ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టరైపోయాడు. అక్కడినుంచి అగ్రహీరోలకు మెయిన్ ఛాయిస్ లా మారి నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా టాలీవుడ్ ని పుష్కర కాలంపాటు ఏలేశాడు. చూడాలని ఉంది కి 10 లక్షలు తీసుకున్న మణి 2002 లో ఇంద్ర సినిమాకు కోటి రూపాయలు తీసుకుని, ఆ ఘనత సాధించిన తొలి సంగీత దర్శకుడిగా నిలిచాడు. బావగారు.. బాగున్నారా, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఖుషీ, ఇంద్ర, ఒక్కడు, ఠాగూర్, అతడు, పోకిరి,.. ఇవన్నీ మణి ఇచ్చిన బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్. 2003లో మహేశ్ ఒక్కడు సినిమా వచ్చేవరకూ ఇండస్ట్రీలో మణిశర్మను చూడాలని ఉంది మ్యూజిక్ డైరెక్టర్ అనే పిలిచేవారు.

 

ఇప్పటికీ తెలుగులో బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ అంటే మణిశర్మ  పేరే చెప్తారు. సినిమాను, హీరో కారెక్టర్ ను ఎలివేట్ చేయడంలో మణి దిట్ట. చాలా సినిమాలకు మణిశర్మ సంగీతం ఇవ్వకపోయినా బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు. అందులో లక్ష్మీ, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు వంటివి ఉన్నాయి. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పాటలు కంటే క్లైమాక్స్ లో మణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ కె ఎక్కువ మార్కులు పడ్డాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: