ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశి గా చెపుతూ ఉంటారు. ఈ ఏకాదశి ని ‘శయన ఏకాదశి - ప్రధమ ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడని పురాణాలు చెపుతున్నాయి. ఈరోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అని అంటారు. 

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడు అయిన  మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు. మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలడంతో ఈరోజు నుంచి దక్షిణాయనం  ప్రారంభం అయింది. ఈ తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరి ని నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది. 

తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలాలపిండిని తప్పకుండా తినాలని అంటారు. తొలి ఏకాదశి పండుగ జరుపుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఈరోజు ఉపవాస దీక్ష చాల మంది ఆచరిస్తూ ఉంటారు. దీని వెనుక కొన్ని ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఉడిపిలో బాలకృష్ణుడుకి బృందావనంలో రాథాకృష్ణుడుకి మహారాష్ట్రలోని పండరీ పురంలో ఉన్న పాండురంగడుకి ఈఆషాడ శుద్ధ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేయడం కొన్ని వందల సంవత్సరాలనుండి కొనసాగుతోంది. మనం ఎలా తలిస్తే భగంవంతుడు ఆలోచనలకు అనుగుణంగా స్పందిస్తాడు అన్న వైష్ణవ తత్వం ఈ తొలి ఏకాదశి లో నిఘూఢoగా ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: