హెచ్ .ఎం.రెడ్డిగారి ప్ర‌తిజ్ఞ (1953) చిత్రం రాజ‌నాల‌ని విల‌న్‌గా, కాంతారావుని హీరోగా ప‌రిచ‌యం చేసింది. ఆ రోజుల్లోని ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ ఒకే ఆలోచ‌న మీద ఉండేవారు. ఫ‌లానా పాత్ర‌కి ఫ‌లానావాళ్లు కావాల‌నుకుంటే వాళ్లే! మార్చేవారు కాదు.  రాజ‌నాల నెల్లూరులో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. న‌ట‌నానుభ‌వం ఉంది  గ‌నుక‌, మ‌ద్రాసు వెళ్లి అంద‌ర్నీ క‌లుస్తూ హెచ్‌.ఎం.రెడ్డిని క‌లిశారు. నెల్లూరులో ఉంటాన‌ని, రెవిన్యూ శాఖ‌లో ఉద్యోగ‌మ‌నీ, పేరు కల్ల‌య్య అనీ చెప్పారు రాజ‌నాల‌. చెప్పేసి వెళ్‌లిపోయారు. ప్ర‌తిజ్ఞ చిత్రాన్ని ప్రారంభిస్తూ రెడ్డిగారు క‌ల్ల‌య్య‌ని పిలుద్దాం అని గుర్తున్నంత వ‌ర‌కూ రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌, నెల్లూరు అని ఉత్త‌రం పంపించార‌ట‌. రాజ‌నాల రెండో రోజే రెడ్డిగారి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. నా సినిమాలో నువ్వు విల‌న్ అన్నారు రెడ్డిగారు. అక్క‌డ్నుంచి ఫైట్స్‌, రిహార్స‌ల్స్ నేర్చుకోవ‌డం మొద‌లు!

ప్ర‌తిజ్ఞ‌లో తొలిసారి హీరో అయిన కాంతారావుకి  హీరోయిన్ సావిత్రి. అంత‌కుముందు రెడ్డిగారు తీసిన నిర్ధోషిలో కాంతారావుకి చిన్న వేషం ఇచ్చారు. నువ్వు ఇంకెక్క‌డా వేషాలు వెయ్య‌కు. హీరోను చేస్తాను అని జుట్టు పెంచ‌మ‌ని, ఉంగ‌రాల జుట్టు చేశారు. గుర్ర‌పు స్వారీ, క‌త్తియుద్ధాలు నేర్పించారు.కాంతారావుకి న‌త్తి ఉండేది బాగా!
రెడ్డిగారి బృందంలోని వాళ్ళు హీరో వేషం ఇచ్చేస్తున్నారా? అత‌ని ప‌లుకు న‌త్తి అని అంటే- ఇది సినిమారా. ఎక్క‌డ న‌త్తి వ‌స్తే అక్క‌డ క‌ట్ చేసి, మ‌ళ్లీ తీసుకోవ‌చ్చు. నాట‌కం అయితే క‌ష్టంగానీ, సినిమాకేం? అన్నారు రెడ్డిగారు. అప్ప‌ట్లో డ‌బ్బింగ్‌లు లేవు. షూటింగ్‌తో పాటు మాట‌లూ రికార్డ్‌ల‌య్యేవి.  రాజ‌నాల (ఇంటి పేరు) విల‌న్‌గా స్థిర‌ప‌డి ఎన్నో సినిమాల్లో న‌టించారు. ముఖ్యంగా రామారావుగారు చాలా చేశారు. సాంఘికాలు, చ‌రిత్ర‌లు, పురాణాలు అన్నీ ఉన్నాయి. మంచి కంఠం, మంచి డైలాగ్ డెలివ‌రీ విధానం, ప‌ర్స‌నాలిటీ ఉండ‌టంతో రాజ‌నాల తార‌గా వెలిగారు. ఆయ‌న‌ను ఎన్టీరామారావుగారు మామాజీ అని పిలిచేవారు.


మరింత సమాచారం తెలుసుకోండి: