కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది రష్మిక మందన్నా. ఆ చిత్ర హీరో, నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి వెంటనే నిశ్చితార్థం చేసుకోవడం కూడా ఆమెను వార్తల్లో వ్యక్తిగా నిలబెట్టింది. కొంత కాలానికే ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావడం, ఆ సినిమా హిట్ కావడం.. ‘గీత గోవిందం’లో ఛాన్స్ లభించడం.. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం.. రష్మిక పెద్ద స్టార్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. 


కెరీర్ ఆరంభంలో తెలుగులో, కన్నడలో సమాంతరంగా సినిమాలు చేసుకుంటూ సాగింది రష్మిక. అప్పుడు డిమాండ్‌కు తగ్గట్లే పారితోషకం కూడా మీడియం రేంజిలో తీసుకుంది. కానీ ఇప్పుడు తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్లతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుందామె.


ఈ నేపథ్యంలో రష్మిక అడక్కపోయినా టాలీవుడ్లో భారీగా పారితోషకాలు ఇస్తున్నారు. అలాంటపుడు రష్మిక కన్నడ సినిమాల వైపు ఎందుకు చూస్తుంది.. చూసినా అక్కడి రేంజికి తగ్గట్లు తక్కువ పారితోషకాల్ని ఎలా అంగీకరిస్తుంది? ఇదే ఇప్పుడు కన్నడ దర్శక నిర్మాతల్ని ఇబ్బంది పెడుతోంది. మనమ్మాయి.. మంచి క్రేజ్ ఉంది.. తనను కథానాయికగా పెట్టుకుందామని ట్రై చేస్తుంటే డేట్లు దొరకట్లేదు. దొరికినా ఆమె అడిగే రెమ్యూనరేషన్ చూసి దిమ్మదిరుగుతోంది. 


తాజాగా ‘డియర్  కామ్రేడ్’ను ప్రమోట్ చేయడం కోసం బెంగళూరుకు వెళ్లిన రష్మికను స్థానిక మీడియా రెమ్యూనరేషన్ హైక్ గురించి అడిగింది. ఆ ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్పింది రష్మిక. మీడియాలో ఉన్న మీరు ఏటా హైక్స్, ప్రమోషన్లు కోరుకోరా? అలాంటపుడు నేను పారితోషకం పెంచడంలో సమస్యేంటి అని ఆమె గడుసుగా ప్రశ్నించడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: