ఒకప్పుడు మలయాళం నుంచి వచ్చిన హీరోయిన్సందరు టాలీవుడ్ ను ఏలిన సందర్భాలున్నాయి. కేరళ నుంచి ఈ అందగత్తెలు టాలీవుడ్ కు రావడం ఇప్పటికీ తగ్గలేదు. ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. ఎటొచ్చి వాళ్ల హవా మాత్రం టాలీవుడ్ స్క్రీన్ పై కనిపించడం లేదు. వచ్చిన వాళ్ళలో 90శాతం మంది మెప్పించలేక వెనుతిరుగుతున్నారు. లేదా ఏమి  చేస్తే క్రేజ్ వస్తుందోనని అల్లాడుతున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మలయాళీ హీరోయిన్లలో సాయిపల్లవి మాత్రమే కొద్దొగొప్పో క్రేజ్ తో కొనసాగుతోంది. అయినప్పటికీ గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడీమెకు లేదు. ప్రస్తుతం సాయిపల్లవి ఆశలన్నీ విరాటపర్వం సినిమాపైనే పెట్టుకుంది. మరో హీరోయిన్ కీర్తిసురేష్ కూడా ఇలానే క్రేజ్ పోగొట్టుకుంది. మహానటితో ఈమె ఇమేజ్ ఆకాశాన్నంటింది. కానీ ఆ ఇమేజ్ ను స్థిరంగా ఉంచుకోవడంలో కీర్తి ఫెయిల్ అయింది. ప్రస్తుతం ఓ కొత్త దర్శకుడితో లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తోంది. దానిపై ఎలాంటి అంచనాల్లేవు. 

మరోవైపు మన్మథుడు-2లో నటిస్తున్నప్పటికీ అది గెస్ట్ రోల్ మాత్రమే. ఇలా క్రేజ్ పాడవడానికి ముఖ్య కారణం మహానటి తర్వాత తెలుగు సినిమాలలో నటించకపోవడమే. సాయిపల్లవి, కీర్తిసురేష్ తర్వాత ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది నివేత థామస్. యాక్టింగ్ టాలెంట్ పుష్కలంగా ఉంది. కానీ తెలుగులో ఆమెకు క్రేజ్ మాత్రం రావట్లేదు. రీసెంట్ గా వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ ను శ్రీవిష్ణు కొట్టేశాడు. నిన్నుకోరి, 118 సినిమాల రేంజ్ లో బ్రోచేవారెవరురా మూవీ నివేతకు కలిసిరాలేదనే చెప్పాలి. వీళ్లు మాత్రమేకాదు.. అనుపమ పరమేశ్వరన్, అను ఎమ్మాన్యుయేల్ కూడా అక్కడ్నుంచే వచ్చారు. కానీ మెప్పించలేకపోతున్నారు. అజ్ఞాతవాసి తర్వాత అను ఎమ్మాన్యుయేల్ పరిస్థితి ఘోరంగా తయారైంది. 

నాగచైతన్యతో కలిసి ఆమె నటించిన శైలజారెడ్డి అల్లుడు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ప్రస్తుతం అవకాశాల్లేక ఇబ్బంది పడుతోంది. అటు అనుపమ పరమేశ్వరన్ కూడా క్రేజ్ తెచ్చుకోలేక ఇబ్బంది పడుతోంది. అ..ఆ, శతమానంభవతి హిట్ అయినప్పటికీ ఆమెకు కలిసిరాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో రాక్షసుడు అనే సినిమా ఒక్కటే ఉంది. అయితే ఇది ఎంతవరకు తనకి ఉపయోగపడుతుందో ఆ దేవుడికే తెలియాలి. మంజిమా మోహన్, మడొన్నా సెబాస్టియన్ అయితే ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. సాహసం శ్వాసగా సాగిపో సినిమా తర్వాత మంజిమా మోహన్ మళ్లీ కనిపించలేదు. అటు మడొన్నా సెబాస్టియన్ కూడా ప్రేమమ్ తర్వాత కనిపించలేదు. ఇలా ఈమధ్య కాలంలో వచ్చిన మలయాళీ ముద్దుగుమ్మలెవ్వరూ స్టార్ స్టేటస్ అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కన్నడ, తమిళ హీరోయిన్లదే హవా నడుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: