గురు స్థానం పరమ పవిత్రమైనది. అజ్ఞానపు చీకటి నుండి జ్ఞానమనే వెలుగును నలువైపులకు ప్రసరింప చేసే శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంది. అటువంటి గురువును పూజించే సాంప్రదాయానికి నాందిగా ప్రతి సంవత్సరం ఆషాడ పౌర్ణమినాడు వచ్చే వ్యాదవ్యాసుడి జయంతిని ‘గురు పౌర్ణమి’ గా జరుపుకోవడం కొన్ని వేల సంవత్సరాల నుండి మన భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగం.

గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా ఙ్ఞానాన్ని మనలో పుట్టించి విష్ణువులా రక్షించి శివుడిలా అఙ్ఞానాన్ని తొలగించి మంచి చెడులను విశదీకరించి మానవతా విలువలు మనకు నేర్పించే మహోన్నత వ్యక్తి అని మన సంస్కృతి చెపుతోంది.  వాస్తవానికి గురువు గుణాతీతుడు రూపరహితుడు భగవత్సమానుడు. జీవితం అంటే ఏవరికైన వెలుగు నీడల దాగుడు మూతలాంటిది. ఆటుపోట్లను తట్టుకుని జీవితంలో విజేతగా ఎలా నిలవాలో తెలుపగల వాడే నిజమైన గురువు.   

'గు' అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని 'రు' అంటే నిరోధించేవాడు అని అర్ధం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కనుకనే గురు స్థానానికి ప్రాముఖ్యత ఉంది. ‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: గురు: సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమ: అంటూ నిరంతరం మన గురువు లను స్మరించుకోవాలని మన సనాతన హైందవ ధర్మం చెపుతోంది. మన జీవితంలో గురువులుగా భావించే వారు ఎవరంటే జన్మను ప్రసాదించిన అమ్మ విద్యనేర్పిన గురువు మంత్రోపదేశం చేసినవారు ఆయుధ విద్య నేర్పిన వారు వేదాధ్యయనము చేయించిన వారు పురాణ ఇతిహాసాలను తెలియజేసిన వారు దైవమార్గం వైపు నడిపించువారు మహేంద్రజాలాది విద్యలు నేర్పిన వారు మోక్ష సాక్షాత్కారము గురించి తెలియజేసినవారు గురువులు అవుతారు అంటూ వేదాలు చెపుతున్నాయి. 

గురు స్థానంలో ఉంటూ కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేసిన రామకృష్ణ పరమహంస ఆది శంకరులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు గురునానక్ దత్తాత్రేయుడు వర్ధమాన మహావీరుడు రమణ మహర్షి షిరిడీ సాయిబాబ భగవాన్ సత్యసాయిబాబా లను గురువులుగా స్మరించుకుంటూ ఈ గురు పూర్ణిమ రోజున వారి బోధనలను కోట్లాది మంది భారతీయులు గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. గురువులను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటే మంచి జరుగుతుంది. శిష్యుడు తన సద్గురువు పాదాలపై తన తలపెట్టి మ్రొక్కి ఆశీస్సులు తీసుకుంటే ఆ గురువు మహిమ చల్లని చూపుల వలన శిష్యుడికున్న సమస్త దోషాలు తొలగిపోతాయని మన పెద్దలు చెపుతూ ఉంటారు. భగవంతుడుకి మరో రూపంలో ఉన్న గురువును ఈరోజు స్మరించుకుంటే ‘నిన్ను నీవు తెలుసుకుంటావు’ అన్న రమణమహర్షి మాటలను స్మరించుకుంటూ గురువులను ఈరోజు పూజించుకుందాం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: