మత సామరస్యాన్ని ప్రభోదించి భక్తి జ్ఞాన కర్మ మార్గాలు మూడింటిని కలబోసి సామాన్యుడుకి కూడ అర్ధం అయ్యే రీతిలో చెప్పిన ఏకైక యోగి షిరిడీ సాయిబాబా. వాస్తవానికి సాయి బాబా ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు. ఏ యోగ మార్గాన్ని ఆయన ఆచరించలేదు. ఏ ప్రత్యేక పూజా విధానాన్ని ఆయన ప్రతిపాదించలేదు. తిథి వార నక్షత్రాలకు బాబా ప్రాధాన్యత ఇవ్వలేదు. ధ్యాన మార్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అందరిలోనూ ప్రేమ భక్తి భావాలను సాయి బాబా ప్రోత్సహించారు. 

ఆత్మజ్ఞాన సాధన మార్గంలో నడవాలనుకునే వారు విశాల హృదయులై ఉండాలని ఎల్లప్పుడు ఆత్మను చూసుకోగలిగే శక్తిని సాధన ద్వారా అభివృద్ధి చేసుకోవాలనీ బాతన బోధనలలో నిరంతరం చెప్పేవారు. ఆత్మజ్ఞాన సాధకుడు అయినప్పటికీ ఇంద్రియ నిగ్రహం అంత తేలిగ్గా అలవడదని దాన్ని ప్రతినిత్యం సాధనతో అలవర్చుకోవాలనీ బాబా అనేక ఉదాహరణలతో తన బోధనలలో తన భక్తులకు వివరించేవారు. 

గురు శిష్య బంధాన్ని గురువుకున్న ప్రాధాన్యతను ధ్యాన సాధన ఆవశ్యకతను బాబా తన బోధనలలో సవివరంగా వివరించారు. సాయిబాబా తన జీవితం ద్వారా చక్కని జ్ఞాన తత్త్వాన్ని భక్తులకు బోధించారు. మానవుడు ప్రారబ్ద కర్మలతో వచ్చిన  బాధల్ని తాను స్వీకరించి తన భక్తులను రక్షిస్తాను అని బాబా చెప్పిన సాయిసచ్చరిత్ర చదివితే అర్ధం అవుతుంది. 

భక్తుల చెడు కర్మలను తానే అనుభవించి భక్తుల కోసం చివరికి ప్రాణ త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి సద్గురు సాయి బాబా. ఈ గురు పౌర్ణమి నాడు షిరిడీ క్షేత్రం నుండి చిన్నచిన్న సాయి బాబా మందిరాల వరకు ఈరోజు సాయి స్మరణతో మారుమ్రోగి పోతుంది. మనకు ఎంతోమంది సద్గురువులు ఉన్నా భగవంతుడు గా కొలిచే ఏకైక మహోన్నత వ్యక్తి షిరిడీ సాయి బాబా మాత్రమే. ఈ గురు పౌర్ణమి రోజున సాయి బాబాను స్మరించని వారుండరు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: