డైరెక్టర్ తేజ తప్పుకున్నాక క్రిష్ దర్శకత్వం వహించాడు ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలకి. బాలయ్య 100 వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాని అత్యధ్బుతంగా తెరకెక్కించి బాలయ్య సినీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లాంటి సినిమాను ఇవ్వడంతో ఎన్టీఆర్ బయోపిక్ ను క్రిష్ చేతిలో పెట్టారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఆ ప్రభావం అందరికంటే ఎక్కువగా ఆ సినిమాను తెరకెక్కించిన క్రిష్ పైనే పడింది. ఈ సినిమాలో నటించిన హీరోహీరోయిన్లు త్వరగానే బయటపడ్డారు. ఎవరిపని వాళ్లు చేసుకుంటున్నారు. టెక్నీషియన్స్ సంగతి సరేసరి. ఎటొచ్చి క్రిష్ మాత్రం అంత త్వరగా ఆ డబుల్ డిజాస్టర్ నుంచి బయటకు రాలేకపోయాడు. అయితే ఎట్టకేలకు క్రిష్ చేతికి పని తగిలిందని లేటెస్ట్ న్యూస్.

ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల తర్వాత ఏ సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్న క్రిష్ కు పిలిచి అవకాశం ఇచ్చాడు దర్శకుడు రాఘవేంద్రరావు. నాగశౌర్య హీరోగా ఓ ప్రయోగాత్మక సినిమాను చేస్తున్నారు రాఘవేంద్రరావు. ఇప్పటికే ఈ సినిమా గురించి అన్నీ అప్‌డేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో 3 ప్రేమకథలుంటాయట. ఒక్కో కథను ఒక్కో దర్శకుడు డైరక్ట్ చేస్తాడని ఇంతకముందే అన్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు. అలా క్రిష్ చేతికి ఇందులోంచి ఓ కథ వచ్చిందని ఫ్రెష్ అప్‌డేట్.

నిజానికి ఈ సినిమాకు కథ రాసింది క్రిష్ కాదు, పూర్తిస్థాయిలో దర్శకత్వం వహించబోయేది కూడా క్రిష్ కాదు. ముగ్గురు దర్శకులు హ్యాండిల్ చేసే ఈ సినిమాలో క్రిష్ ది చాలా చిన్న పాత్ర. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రిష్ కు ఈ అవకాశాన్ని ఒప్పుకోక తప్పలేదని అంటున్నారు. ఇక మిగతా ఇద్దరు దర్శకులు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది. తనకు కష్టమైనప్పటికీ ఈ సినిమా కోసం కాల్షీట్లు కేటాయిస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ హీరో చేతిలో 3 సినిమాలున్నాయి. అయినప్పటికీ రాఘవేంద్రరావు అడగడంతో కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేస్తున్నాడు. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: