ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి ఇంతకముందు ఓ వివాదం వచ్చిన సంగతి గుర్తుండేవుంటుంది. ఈ సినిమా కథను ఓ వెబ్ సైట్ లో పెట్టేశారు. ఆ తర్వాత యూనిట్ కు బ్లాక్ మెయిల్ కాల్స్ కూడా వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ స్పందించాడు. "ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ మాకు తెలుసు. మాకు డబ్బులు ఇవ్వండి. లేకపోతే బయటపెట్టేస్తాం అంటూ కొంతమంది బ్లాక్ మెయిల్ చేశారు. దీనిపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చాం. ఓ వెబ్ సైట్ లో వచ్చిన కథను కూడా తీయించాం. ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత ఇలాంటి కష్టాలు తప్పవు. ఆ సమస్యలన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయాయి." అన్నాడు.

అంతేకాదు తన సినిమా క్లిప్పింగులు ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంపై పూరి జగన్నాథ్ బాధ వ్యక్తంచేశాడు. బయట షూటింగ్స్ చేస్తున్నప్పుడు అలాంటివి తప్పవని, ఇండియన్స్ ను మార్చలేమని అన్నాడు. బాధను వ్యక్తపరచాడు. "చార్మినార్ లో షూటింగ్ చాలా ఇబ్బంది పెట్టింది. ఇండియాలో పబ్లిక్ లో షూటింగ్ ఎప్పుడూ కష్టమే. చార్మినార్ లాంటి ప్లేసుల్లో ఇంకా కష్టం. అన్నింటికంటే మాకు పెద్ద టెన్షన్ ఏంటంటే.. కొన్ని వందల మంది వీడియోలు తీసేసి వెంటనే ఫేస్ బుక్ లో పెట్టేస్తుంటారు. అది చాలా ప్రాబ్లమ్. మన ఇండియన్స్ అంతా అంతే." తన మార్క్ డైలాగ్స్ ని విసిరాడు.

ఇక ఈసారి తన సినిమాకు మహిళా సంఘాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదంటున్నాడు పూరి. మరీ ముఖ్యంగా రెండో ట్రయిలర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువమంది అమ్మాయిలే తనకు ఫోన్ చేసి చాలా బాగుందని చెబుతున్నారని.. ఈసారి తన సినిమాకు మహిళల నుంచి ఇబ్బందులు రావని అంటున్నాడు. గతంలో మహేష్ తో పూరీ తీసిన బిజినెస్ మాన్ సినిమాకు కూడా అమ్మాయిలు ఇలానే పూరీని పొగడ్తలతో ముంచేశారు. ఇక సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఇస్మార్ట్ శంకర్ గురువారం థియేటర్లలోకి రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: