సినిమాని ప్రాంతీయత కోణంలో చూస్తారా?  హీరో వేషం.. యాస-భాష .. సంస్కృతి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని థియేటర్లకు వస్తారా? అంటే అలాంటిదేమీ లేదని అన్నారు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ సందర్భంగా రామ్ కి ఇలాంటి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైతే అందుకు రామ్ స్పందించిన తీరు ఆసక్తిని కలిగించింది. ఇస్మార్ట్ శంకర్ తెలంగాణా యాస ఆంధ్రా వాళ్లకు నచ్చుతుందా? అన్న ప్రశ్నకు ఇది తెలంగాణ యాస, ఇది ఆంధ్రా భాష అంటూ జనం సినిమాలు చూడరు. అందులో కథ, కంటెంట్ యంగేజ్ చేస్తే చూసేస్తారు అని అన్నారు. అయినా సినిమాల్ని ఇది తెలంగాణ.. ఇది ఆంధ్రా అన్న కోణంలో విభజించి చూడొద్దు అని రామ్ తేల్చి చెప్పాడు. 

సినిమా నచ్చితేనే జనాలు చూస్తారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఆడిన ఆంధ్రా బ్రాండ్ సినిమాల్ని ఇక్కడా ఆదరించారని రామ్ చెప్పాడు. నైజాం యాస అర్థం కానంతగా ఏదీ సినిమాలో ఉండదని రామ్ తెలిపారు. ఓ బేబిలో సమంత ఆంధ్రా యాసలో మాట్లాడితే.. ఫిదాలో సాయి పల్లవి పూర్తిగా తెలంగాణ యాసలోనే మాట్లాడింది. ఆ రెండూ బ్లాక్ బస్టర్ హిట్ కదా? అన్న ఎగ్జాంపుల్ ని గుర్తు చేశాడు.  

ఇస్మార్ట్ శంకర్ కొరియన్ సినిమా కాపీ కదా? అన్న ప్రశ్నకు.. అందులో వాస్తవం లేదని రామ్ ఖండించారు. తల వెనక మెమరీ చిప్.. సిమ్ కార్డ్ అన్న పాయింట్ తప్ప కథ కాపీ అని చెప్పలేరని అన్నారు. మాస్ ఇస్టయిల్ ఇస్మార్ట్ శంకర్ తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అన్న ధీమాని వ్యక్తపరచాడు కూడా. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ ని కీలక మలుపు తిప్పే బ్లాక్ బస్టర్ అందుకుంటుందా? అన్న ఆసక్తి సినీవర్గాల్లో ఇప్పటికే నెలకొంది. మరి రీలిజ్  అయ్యాక గాని విషయం ఏంటనేది తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: