దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో సెలబ్రెటీలు సైతం కన్నుమూసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. రోజు రోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్ట్ లు.. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు...అతివేగం నివారించడానికి సూచనలు ఇలా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలను మాత్రం అరికట్టలేక పోతున్నారు.  రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబ సభ్యల వేదనను ఎవరూ తీర్చలేకపోతున్నారు.

తాజాగా రోడ్డు ప్రమాదంలో బాలనటుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. టివిల్లో నటిస్తూ ఎంతో మంచి భవిష్యత్ ఊహించుకున్న ఓ చిన్నారి ప్రమాదంలో రూపంలో మృత్యువు కబలించింది.  ఛత్తీస్‌గడ్‌ రాయ్‌పూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో  హిందీ టీవీ సీరియళ్లలో నటించిన పాపులర్ అయిన  శివలేఖ్ సింగ్ ‌(14)  దుర్మరణం పాలయ్యారు. కారులో బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వైపు వెళుతుండగా వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే మరణించగా,  అతని తల్లి లేఖ్నా సింగ్‌, తండ్రి శివేంద్రసింగ్‌ తోపాటు మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యారు. అయితే తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇక చత్తీస్‌గడ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాకు చెందిన శివలేఖ్ సింగ్  తల్లిదండ్రులతో ముంబైలో నివసిస్తున్నారు. ‘సంకట్‌ మోచన్‌ హనుమాన్‌’, ‘ససురాల్‌ సియర్‌ కా’ లాంటి సీరియల్స్‌తోపాటు అనేక టీవీ రియాల్టీ షోలలో  శివలేఖ్‌ కనిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: