ఇస్మార్ట్‌ శంకర్ ప్రమోషన్ లో భాగంగా మహేష్ మీద పూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంట రేపుతున్నాయి. ''మహేష్‌బాబుతో 'జనగనమన' సినిమా ఎప్పుడు.?'' అంటూ ఒకటికి పదిసార్లు మహేష్‌ అభిమానులు, పూరి జగన్నాథ్‌ని ప్రశ్నిస్తూనే వుంటారు. కానీ, మహేష్‌ మాత్రం పూరి జగన్నాథ్‌కి ఆ ఛాన్స్‌ ఇవ్వడంలేదు. 'మహర్షి' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన పాతిక సినిమాల ప్రస్థానం గురించి మాట్లాడుతూ, పూరి జగన్నాథ్‌ పేరుని మర్చిపోయాడు మహేష్‌. అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే జరిగింది.


ఆ తర్వాత మహేష్‌, సోషల్‌ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు.. పూరికి సారీ చెప్పాడు, 'పోకిరి' గురించి చెప్పుకున్నాడు కూడా. అక్కడితో ఆ వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారుగానీ.. పూరి జగన్నాథ్‌ గట్టిగానే కెలికేశాడు.  ఓ ఛానల్‌కిచ్చిన 'ఇస్మార్ట్‌' ఇంటర్వ్యూలో భాగంగా పూరి జగన్నాథ్‌, మహేష్‌ ప్రస్తావన రాగానే.. తనదైన స్టయిల్లో సెటైర్లు వేసేశాడు.  మహేష్‌ అభిమానులకు తన మీద నమ్మకం, అభిమానం వున్నాయనీ, మహేష్‌ మాత్రం తనకు ఛాన్స్‌ ఇవ్వడంలేదనీ, ఇవ్వబోడనీ చెప్పేశాడు.


'నేను హిట్స్‌లో వుంటేనే మహేష్‌ నన్ను పట్టించుకుంటాడు..' అని చెప్పాడు పూరి. 'ఇస్మార్ట్‌ శంకర్‌' హిట్టయితే, మహేష్‌ పిలుస్తాడేమో కదా? అనడిగితే, 'నాకూ క్యారెక్టర్‌ వుంది..' అంటూ పూరి చేసిన వ్యాఖ్యలిప్పుడు వైరల్‌గా మారాయి. ఇంతకీ, పూరి జగన్నాథ్‌కీ మహేష్‌కీ ఎక్కడ చెడింది.? ఏమోగానీ, మహేష్‌ అభిమానులు మాత్రం చాలా బీభత్సంగా పూరి జగన్నాథ్‌ని 'ట్రోలింగ్‌' చేసేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: