భద్ర సినిమాతో దర్శకునిగా కెరీర్ స్టార్ట్ చేసిన బోయపాటి శ్రీనుకు మధ్యలో దమ్ము లాంటి ఒకటీ అరా ఫ్లాపులు వచ్చినా మిగతా సినిమాలన్నీ సూపర్ హిట్లయ్యాయి. కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన వినయ విధేయ రామ సినిమా దర్శకునిగా బోయపాటి శ్రీనుకు ఉన్న పేరంతా పోగొట్టింది. ఈ సినిమా కథ, కథనంపై చాలా విమర్శలొచ్చాయి. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత రామ్ చరణ్ కు వినయ విధేయ రామ సినిమా రూపంలో భారీ షాక్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. 
 
వినయ విధేయ రామ ఫ్లాప్ అవ్వటంతో ఏ స్టార్ హీరో కూడా బోయపాటి శ్రీనుకు అవకాశం ఇవ్వలేదు. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చినప్పటికీ బాలకృష్ణ కూడా బోయపాటి శ్రీనుకు అవకాశమివ్వలేదు. ఇలాంటి సమయంలో గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో గతంలో బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. 
 
బోయపాటి శ్రీను సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత వేణు శ్రీరామ్ ఐకాన్ మూవీలో అల్లు అర్జున్ నటించబోతున్నాడు. ఐకాన్ సినిమాతో పాటు బోయపాటి సినిమాకు కూడా డేట్స్ ఇవ్వాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నాడని సమాచారం. ఈ సినిమా గురించి మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: