భారత స్ప్రింటర్ హిమ దాస్ కేవలం 20 రోజుల్లో ఐదు బంగారు పతకాలు సాధించి దేశం గర్వించేలా సత్తా చాటింది. యూరప్‌లో ఈనెల 2న తొలి బంగార పతకాన్ని సాధించిన హిమ దాస్ అక్కడి నుంచి వరసపెట్టి ఐదు బంగారు పతకాలు గెలుచుకుంది. మొదటిగా జులై 2న పోలాండ్‌లో పొజ్నాన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో పాల్గొన్న హిమ దాస్ 200 మీటర్ల రేస్‌లో బంగారు పతాకం సాధించింది. ఆ తరవాత జులై 7న పోలాండ్‌లోనే కుట్నో అథ్లెటిక్స్ మీట్‌లో 200 మీటర్ల రేస్‌లో అగ్రస్థానంలో నిలిచి రెండో గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. 


జులై 13న చెక్ రిపబ్లిక్‌లో క్లాడ్నో అథ్లెటిక్స్ మీట్‌లో 200 మీటర్ల రేస్‌లో మూడో బంగారు పతాకాన్ని కైవసం చేసుకుంది. ఆ దేశంలోనే 17వ తేదీన జరిగిన టాబర్ అథ్లెటిక్స్ మీట్‌లో నాలుగో బంగారు పతకం సొంతం చేసుకుంది. అక్కడే జరిగిన 400 మీటర్ల రేస్‌లో అస్సాంకు చెందిన ఈ 19 ఏళ్ల రన్నర్ ఐదో గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. ఇలా కేవలం 20 రోజుల్లోనే ఐదు బంగారు పతకాలు సాధించి దేశ ఖ్యాతిని చాటింది. ప్రస్తుతం హిమ దాస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశంలోని క్రీడాకారులకు హిమ దాస్ స్ఫూర్తి అంటూ సినీ, క్రీడా ప్రముఖులు కొనియాడుతున్నారు. 


హిమ దాస్ ‘బంగారు’ ప్రదర్శనపై టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ స్పందించారు. తనను చూసి దేశ ప్రజలు గర్వపడుతున్నారని ట్వీట్ చేశారు. ‘నువ్వు ఇలాగే దూసుకుపో అమ్మాయి!!!! దేశంలో ఉన్న ప్రతి ఇంటికి ఇప్పుడు నువ్వు కూతురువి. 1.3 బిలియన్ల ప్రజలను గర్వపడేలా చేశావు హిమ దాస్’ అని తన ట్వీట్‌లో తేజూ పేర్కొన్నారు. 


ఒక్క తేజూనే కాదు.. బాలీవుడ్ నటుడు, జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ కూడా హిమ దాస్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు. ‘ఈ విజయం మీకు స్ఫూర్తినివ్వకపోతే ఇంకేమిస్తుంది???? 20 రోజుల్లో ఐదో బంగారు పతకం!!! నువ్వు అసలు సిసలైన సూపర్ స్టార్ హిమ దాస్. నిజంగా భారత్ గర్వపడేలా చేశావు. అభినందనలు’ అని రితేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: