ఇటీవల కొద్దిరోజుల క్రితం కన్నడ నటుడు యాష్ హీరోగా వచ్చిన కెజిఎఫ్ సినిమా, దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో కూడా ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం అదే ఊపుతో ఆ సినిమా రెండవ భాగమైన చాప్టర్ 2 షూటింగ్ ని ప్రారంభించింది సినిమా యూనిట్. ఇక మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా భారీ ప్రాజక్ట్ ఆర్ఆర్ఆర్ ని రూపొందుతోంది. అటు బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత ఆర్ఆర్ఆర్ పై, అలానే కెజిఎఫ్ చాప్టర్ 1 సూపర్ సక్సెస్ తరువాత చాప్టర్ 2 పై అంచనాలు తారా స్థాయిలో ఉండడంతో, ఒకవేళ ఈ రెండు భారీ సినిమాలు కనుక ఒకేసారి విడుదలైతే ఏంటి పరిస్థితి అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు ప్రేక్షకులు. 

అయితే ఇప్పుడు అదే అనుమానం నిజం అయ్యే అవకాశాలు కొంతవరకు ఉన్నట్లు చెప్తున్నాయి సినిమా వర్గాలు. ఇప్పటికే తమ ఆర్ఆర్ఆర్ సినిమాను వచ్చే ఏడాది జులై 30న పక్కాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని ఆ సినిమా యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటున్నప్పటికీ, వారు అనుకున్న విధంగా వచ్చే ఏడాది ప్రధమార్ధంలోగా సినిమాని విడుదల చేయాలని చేసిన ప్లానింగ్ కొంత తప్పే అవకాశం గోచరిస్తోందట. దానికి కారణం, ఆ సినిమా కోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సిజి మరియు గ్రాఫిక్ వర్క్ ను వినియోగించాలని సినిమా యూనిట్ నిర్ణయించడమేనట. దాని ప్రకారం చూసుకుంటే ఆ వర్క్ పూర్తి కావడానికి అనుకున్న దానికంటే మరింత ఎక్కువ సమయం పట్టేలా ఉందని అంటున్నారు. 

ఇటీవల కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నారన్న వార్తలు రావడం నిజమని తేలడంతో ఆ సినిమా ఎంత త్వరగా సెట్స్ పైకి వెళ్తుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తుంటే, ఇప్పుడు కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదల జాప్యం కారణంగా ఆ సినిమా కూడా మరింత ఆలస్యం అవుతుందంటున్నారు. ఇకపోతే కెజిఎఫ్ యూనిట్ అనుకున్న విధంగా కాకుండా, నిజంగానే విడుదలలో ఆలస్యం కనుక జరిగితే, కొంచెం అటు ఇటుగా ఆర్ఆర్ఆర్ సినిమా సమయానికే వారి సినిమా కూడా విడుదలచేయొచ్చని వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే ఈ రెండు భారీ సినిమాలకు కూడా కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ప్రస్తుతం కొన్ని మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ నిజం అయితే మాత్రం కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: