బిగ్ బాస్ షో మీద అన్నీ భాషల్లో రచ్చలు, గొడవలు, కేసులు అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో మీద గడిచిన కొద్దిరోజులుగా వెలుగు చూసిన ఫిర్యాదుల సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో అందరికంటే ముందు మమ్మలిని ఎంపిక చేసినట్లుగా చెప్పి.. తర్వాత కమిట్ మెంట్ అడిగారని.. తమ పై వారిని ఎలా సంతృప్తి పెడతారు..? అని ప్రశ్నించారని.. ఆ తర్వాత మాకు షోలో సెలెక్ట్ కాలేదని చెప్పారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

బిగ్ బాస్ షో మీద మొదటి నుంచి పోరాడుతున్న శ్వేతారెడ్డి ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదులు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా బంజారాహిల్స్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లో ఉన్న స్టార్ మా కార్యాలయంలోని ఆడ్మిన్ హెడ్ శ్రీధర్ కు నోటీఉలు అందజేశారట. బిగ్ బాస్ ఇన్ ఛార్జ్ శ్యాంతో పాటు రవికాంత్.. రఘు.. శశికాంత్ లపై శ్వేతారెడ్డి ఈ నెల 13న కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. 

ఈ ఫిర్యాదులపై వివరాలు సేకరించేందుకు స్టార్ మా కార్యాలయ ఆడ్మిన్ కు సీఆర్పీసీ 91.. 160 కింద నోటీసులు అందజేశారని లేటెస్ట్ న్యూస్. ఒప్పంద వ్యవహారం, ఎంపికకు ఉన్న నిబంధనలు శ్యాంతో పాటు మిగిలిన ముగ్గురి పాత్ర మీద వివరాలు తమకు సమాధానం ఇవ్వాలని పోలీసులు కోరారట. ఓవైపు బిగ్ బాస్ షో మొదలై.. హౌస్ మేట్స్ మధ్య రచ్చ మొదలై హాట్ హాట్ గా ఉన్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇక బయట కూడా బిగ్ బాస్ మీద వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఒక అడుగు ముందుకేయటం ఆసక్తికరంగా మారింది. మరి వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: