సాధారణంగా దర్శకుడు వేరే ఇతర డిపార్ట్మెంట్స్ లో క్రియేటివ్ సైడ్ తప్ప పెద్దగా కలగజేసుకోడు. కానీ కొంత మంది దర్శకులు నిర్మాతలుగా మారడమే కాదు అందులో సక్సెస్ అయ్యారు కూడా. ఆ మధ్యన ఈ ట్రెండ్ కొంచెం తగ్గినా కూడా మళ్ళీ ఈ మధ్యనే ఊపందుకుంది.


శేఖర్ కమ్ముల :


ఆనంద్ సినిమాతో తన జర్నీని మొదలుపెట్టిన శేఖర్ కముల హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లాంటి సినిమాల‌ను సొంత నిర్మాణ సంస్థ‌ల్లోనే తెర‌కెక్కించాడు. చిన్న సినిమాల‌ను తానెప్పుడూ నిర్మించ‌డానికి సిద్ధంగానే ఉంటానంటున్నాడు ఈయ‌న‌. పై రెండు సినిమాలే కాక తన శిష్యుడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ అప్ప‌ట్లో ఆవ‌కాయ్ బిర్యానీ సినిమాను సొంతంగానే నిర్మించాడు.


పూరి జగన్నాథ్ :


ఇప్ప‌టికే తెలుగులో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పూరి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. త‌న‌కు న‌చ్చిన క‌థ‌లు బయట నిర్మాత‌ల‌కు న‌చ్చాల‌ని లేదు కాబట్టే నిర్మాతగా మారాను అని చెప్తాడు పూరి. ఇప్పటికే టూరింగ్ టాకీస్ బ్యానర్ పై చాలా సినిమాలు నిర్మించిన పూరి తాజాగా విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దండ‌యాత్ర చేస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాకు దర్శకుడు, నిర్మాత ఈయనే కావడం విశేషం.


సుకుమార్ :


క్రియేటివ్ దర్శకుడిగా సుకుమార్ కు చాలానే పేరుంది. ఈయన లాజిక్ లు పట్టుకోవడం సినీ ప్రేక్షకులకు అంత ఈజీ కాదు. .ఇప్పటికే స్టార్ దర్శకుడిగా టాప్ హీరోలతో సినిమాలు తెరకెక్కించే ఈయన నిర్మాతగా మారి తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తున్నాడు. కుమారి 21ఎఫ్ అలా వచ్చిన చిత్రమే. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ ను పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు.


సంపత్ నంది :


చేసింది త‌క్కువ సినిమాలే అయినా తెలుగులో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సంప‌త్ నంది. ఈయ‌న కూడా నిర్మాత‌గా మారాడు. అప్ప‌ట్లో ఈయ‌న నిర్మించిన గాలిపటం బోల్డ్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక పేప‌ర్ బాయ్ కూడా ఈయ‌న నిర్మించిన సినిమానే.


తేజ :


చిత్రం మూవీస్ అంటూ ఓ నిర్మాణ సంస్థ పెట్టుకుని అందులోనే సినిమాలు నిర్మించాడు తేజ‌. ఈ మ‌ధ్య కాలంలో ఇత‌ర నిర్మాతల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాడు కానీ ఒక‌ప్పుడు సొంతంగానే సినిమాలు నిర్మించి తెర‌కెక్కించాడు.


కొరటాల శివ :


చేసినవి నాలుగు సినిమాలే అయినా దర్శకుడిగా టాప్ స్టేటస్ వచ్చింది కొరటాల శివకు. తన సినిమాల ద్వారా సమాజానికి ఎంతో కొంత మంచి జరగాలని ఆకాంక్షించే వ్యక్తి కొరటాల శివ. అది ఆయన సినిమాల్లో స్పష్టంగా తెలుస్తుంది. రైటర్ గా తన కష్టాన్ని కొంతమంది దర్శకులు వాడేసుకుంటున్నారు అని ఫీలై దర్శకుడిగా మారిన కొరటాల ఇప్పుడు తనకు నచ్చిన సినిమాలు తెరకెక్కించేందుకు నిర్మాతగా కూడా మారుతున్నాడు.
పరశురామ్ దర్శకత్వంలో కొరటాల శివ నిర్మాణంలో మహేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కే ఆలోచనలు ఉన్నాయి.
వీరే కాకుండా హరీష్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి కూడా పూర్తి నిర్మాతలుగా మారకపోయినా తాము తెరకెక్కించే సినిమాల నిర్మాణ బాధ్యతలు మొత్తం చూసుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: