తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడు కోటికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందన్న విషయంలో ఎలాంటి సందేహాం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించిన కోటి ప్రస్తుతం బుల్లి తెరపై అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తున్నారు. సినిమాల సంఖ్య పూర్తిగా తగ్గించిన కోటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సంగీత దర్శకులకు.. సింగర్స్ కు అసలు విలువ లేకుండా పోయింది. దర్శక నిర్మాతలు మాత్రమే కాకుండా ఇతర టెక్నీషియన్స్ కూడా మమ్ములను గౌరవంగా చూడటం లేదు..అంటూ తన ఆవేదనని వ్యక్తపరచారు. 

సినిమాకు ఒకప్పుడు సంగీతం చాలా ముఖ్యంగా భావించే వారు. కాని ప్రస్తుతం చిన్న సినిమాల దర్శకులు, నిర్మాతలు ఎవరు తక్కువ బడ్జెట్ లో కంపోజ్ చేస్తే వారితోనే చేయించే పరిస్థితి వచ్చింది. సినిమా రంగంలో సంగీతం అనేది దిగజారి పోతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహరించడంతో ఎవరికీ వ్యాల్యూ లేకుండా పోయింది. కొత్త సంగీత దర్శకులు ఇలా వచ్చి అలా వెళ్లి పోతున్నారు. ఒకటి రెండు సినిమాల తర్వాత కనిపించటం లేదు. ఇక సింగర్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అప్పట్లో పెద్ద సినిమాలకు పాట పాడితే మంచి రెమ్యునిరేషన్ ఉండేది. కాని ఇప్పుడు పెద్ద సినిమాలకు పాడినా కూడా చిన్న రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

అప్పట్లో మ్యూజిక్ కంపోజర్స్ కు.. సింగర్స్ కు మంచి గౌరవం ఉండేది. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఒకప్పుడు స్టూడియో అంటే గొప్పగా ఉండేది. కాని ఇప్పుడు రెండు కంప్యూటర్లు పెట్టి స్టూడియో అనేస్తున్నారు. రూ. 100.. 150 కి కూడా స్టూడియోలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేరళలో మరీ దారుణంగా దొడ్లో స్టూడియో అంటూ ఏర్పాటు చేస్తున్నారు. కంప్యూటర్లు రావడంతో మాటలను, పాటలను అందులో మార్చేస్తున్నారు. కంప్యూటర్ లను నేనేం తప్పుపట్టడం లేదు... కాని అవి వచ్చిన తర్వాత మాకు గౌరవం తగ్గిందని కోటి ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క కోటీనే కాదు చాలా మంది సింగర్స్ ఈ మధ్య ఈ విషయంలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒక పాట పాడితే కేవలం 5 వేలు ఇస్తున్నారు. అదే బాలీవుడ్ సింగర్స్ అయితే లక్షల్లో ఇస్తున్నారు. మేమంటే ఎందుకంత చులకనో అర్థం కావటం లేదని చాలామంది వాపోతున్నారు. మరి ఈ విషయంలో ఇండస్ట్రీ ధోరణి మారితే బావుంటుందేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: