అద్భుతమైన భావం ఉంటే వెండి తెరపై ద్రుశ్యం రసమయమవుతుంది. అందమైన సన్నివేశం ఆవిష్కరించబడుతుంది. మెదడులో పుట్టిన ఒక్క ఆలోచన సెల్యూలాయిడ్ పై కొత్త అందాలను తెస్తుంది. రవి కాంచని చోట కవి గాంచును అన్న తీరుగా తాను వూహించిన  దాన్ని తెరపై చూపించేలా చేయడం మహా కవులకే సాధ్యం.


అటువంటి ఉత్తమమైన కవులు, సాహితీకారులలో ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ  ఒకరు. ఆయన నిన్న తనువు చాలించారు. మూడు పాతికల జీవితాన్ని చూసిన ఇంద్రగంటి సాహితీ లోకంలో ఇంద్ర ధనస్సులే మెరిపించారు. ఆయన కలం నుంచి జాలువారిన ఎన్నో రచనలు సాహితీప్రియులను విశేషంగా అలరించాయి. ఆయన బహుముఖ ప్రతిభా ప్రవీణుడు.


ఇంద్రగంటి సాహిత్య పార్శ్వాలలో తెలుసు సినిమా రచన ఒక భాగం. ఆయన 1980 ప్రారంభంలో ఎన్నో సినిమాలకు పాటలు రాశారు.   అందులో రాశి తక్కువ అయినా వాసి గొప్పది. నెలవంక సినిమాలో మొత్తం పాటలను ఆయన రాస్తే సంగీత స్రష్ట రమేష్ నాయుడు చక్కని బాణీలు సమకూర్చారు. అందులో ప్రేయసీ ప్రియుల మీద రాసిన ఆయన పాట ఒకటి ఉంది.


కనుబొమ్మల పల్లకి లోనా, కన్నె సిగ్గు వధువైంది అంటూ సాగే ఈ పాటలో ఇంద్రగంటి అద్భుత భావనా ప్రకటనా శక్తి ఏంటో అర్ధమవుతుంది. కను రెప్పల గొడుగులు వేసి నీకు నీడనవుతాను,  అడుగులకే మడుగులుగా అర చేతులు పడతాను ఇలాంటి  అలతి అలతి పదాలతో ఇంద్రగంటి తన సినీ రచనను కొనసాగించారు. ఇందులోనే హిందూ ముస్లిం మతాల సమైక్యతను చాటిచెప్పే జాతీయ భావనా గీతం కూడా ఆయన రచించి మెప్పు పొందారు. 


ఆయన జంధ్యాల సినిమాలకే పాటలు ఎక్కువగా రాశారు. చివరిగా తన కుమారుడు, దర్శకుడు ఇంద్రగంటి మోహన క్రిష్ణ సమ్మోహనం చిత్రానికి పాటలు రాయడంతో ఆయన్ సినీ జీవితం ముగిసినట్లైంది. ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి  వంటి పండితుడు ఆయన తండ్రి. సతీమణి ఇంద్రగంటి జానకీబాల కూడా సాహితీమూర్తి. కుమారుడు చక్కని అభిరుచి గల దర్శకుడు. మొత్తానికి ఇంటిపేరు ఇంద్రగంటి. అన్నింటా వారికి వారే సాటి అనిపించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: