తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పడానికి ఎలా పోటీ పడ్డారో తెలిసిందే. అంతకుముందు ఎన్నికల్లో విజయం సాధించినపుడు కేసీఆర్, కేటీఆర్‌లిద్దరికీ టాలీవుడ్ జనాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ విజయంతో అధికారంలోకి రాగా.. టాలీవుడ్ నుంచి అసలు స్పందనే లేదు. 


చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడూ ఇదే పరిస్థితి. తమ అవసరాలన్నీ హైదరాబాద్‌తో ముడిపడి ఉండటంతో అందుకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారు. ఐతే ఈ విషయాన్ని జగన్ అండ్ కో ఏమేరకు పట్టించుకుంటోందో కానీ.. ఆ పార్టీ మద్దతుదారైన నటుడు పృథ్వీ మాత్రం సినీ జనాలపై తరచుగా విరుచుకుపడుతున్నాడు. తాజాగా తను మరోసారి టాలీవుడ్ ప్రముఖులపై ధ్వజమెత్తాడు.ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తే సినిమా ఛాన్సులు రావని తనను కొందరు బెదరించారని.. అయినా తాను అవన్నీ పట్ట్టించుకోకుండా ముందుకెళ్లనన్నాడు పృథ్వీ.


ఎవరో అవకాశం కలిపిస్తారని తాను ట్రంక్ పెట్టెతో హైదరాబాద్‌కు రాలేదని.. స్వశక్తిని నమ్ముకున్నానని పృథ్వీ చెప్పాడు.టాలీవుడ్ సినీ పెద్దలకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదని.. వాళ్లెవ్వరూ ఏపీ ముఖ్యమంత్రిని పట్టించుకోవట్లేదని అన్నాడు పృథ్వీ. ఇకపై జనాలు సినిమా వాళ్లకు ఓట్లు వేయద్దని ఈ సందర్భంగా పృథ్వీ పిలుపునిచ్చాడు. అమరావతి గడ్డపై ఇంకో 30 ఏళ్లు వైసీపీ జెండానే ఎగురుతుందని పృథ్వీ ధీమా వ్యక్తం చేశాడు.  


తనకు ఎస్వీబీసీ పగ్గాలు అప్పగించడంపై పృథ్వీ స్పందిస్తూ.. థర్టీ ఇయర్స్ పృథ్వీగా తానెలా పేరు తెచ్చుకున్నానో ఎస్పీబీసీ ఛానల్‌కు కూడా అలాగే మంచి పేరు తెస్తానని అన్నాడు. ఐతే వైకాపా నుంచి కూడా సినిమా వాళ్లు పోటీ చేస్తుండగా, సినిమా వాళ్లు ప్రచారం చేస్తుండగా సినిమా వాళ్లకు ఓటేయొద్దని పృథ్వీ అనడం ఎంతవరకు సమంజసం అని చర్చిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: