30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి టైమ్ బావుంది. వైసీపీని ముందు నుంచీ నమ్మి ఆ పార్టీ వెంట నడిచిన అతడికి ఇప్పుడు ఆ ఫలితం కనిపిస్తోంది. ఏకంగా ఎస్వీబీసీ ఛైర్మన్ గిరీ దక్కింది. గతంలో ఈ పోస్టు రాఘవేంద్రరావు వంటి దిగ్గజ దర్శకుడు దక్కించుకున్నారు.


అయితే.. అంతటి అవకాశం దక్కిన పృధ్వీ అనవసర వివాదాలతో కెలుక్కుంటున్నట్టు కనిపిస్తోంది. ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే సమయంలో చేసిన కామెంట్లు వివాదస్పదం అయ్యాయి. ఆయన ఏమన్నారంటే..

“ వెంకటేశ్వరస్వామే నన్ను ఇక్కడకు పిలిపించుకున్నారు. నేనేంటో మాటల్లో చెప్పను, చేతల్లో చేసి చూపిస్తా.. ఎస్వీబీసీ ఛానల్ ను భక్తుల్లోకి మరింత తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటా.. సినిమా వాళ్ళను నమ్మి ఓటేయవద్దు.. అలా నమ్మే పరిస్థితులు ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలితతోనే ముగిశాయి.”


సినీరంగం నుంచి వచ్చి.. సినిమావాళ్లకు ఓటేయొద్దని చెప్పడం విచిత్రంగా ఉంది. బహుశా పృథ్వీ ఈ కామెంట్లు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చెప్పి ఉండొచ్చు.. ఆయన ఉద్దేశ్యంలో జగన్ కు పవన్ కాబోయే ప్రత్యర్థిగా భావించి ఉండొచ్చు.. కానీ అలా నేరుగా సినిమా వాళ్లపై కామెంట్ చేయడం అనవసర వివాదానికి దారి తీసింది.


ఎన్నికల సమయంలో పృథ్వీ , పోసాని, ఆలీ, శివాజీరాజా, జోగినాయుడు వీళ్ళంతా వైసీపీ కోసం పని చేశారు. జగన్ కు ఓటేయమని చెప్పారు. అంటే ప్రచారానికి పనికొచ్చే సినిమా నటులు పాలనకు పనికిరారా.. అన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నుంచి కూడా నటులు రాజకీయాల్లో ఉన్నారు. వైసిపిలో న‌గ‌రి శాస‌న‌స‌భ్యురాలు, ఏపీఐఐసీ ఛైర్‌ప‌ర్సన్ రోజా ప్రముఖ హీరోయిన్‌గా వెలిగారు. అలాగే రాజ‌మండ్రి పార్లమెంటు స‌భ్యులు మార్గాని భ‌రత్ ` ఓయ్ నిన్నే` సినిమాలో హీరోగా నటించాడు కూడా.


ఎన్టీఆర్ ను గెలిపించిన ఆ ప్రజ‌లే రోజా, భ‌ర‌త్‌ను కూడా గెలిపించారు...ఇంకా వైసిపీ ప్రజా ప్రతినిధుల్లో నిర్మాత‌లు కూడా ఉన్నారు. అందుకే పృథ్వీ ఇలాంటి కాంట్రావర్సీ స్టెట్ మెంట్లతో అనవసర వివాదాలు తెచ్చుకోకుండా.. జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బావుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: