ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కొన్ని సినిమాలు తెలిసి చేసినా తెలియక చేసినా వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు నిర్మాత బెల్లంకొండ సురేష్‌ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఎప్పుడో ఈయన నిర్మించిన ఓ సినిమా ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. వ్యవహారం ఏకంగా అరెస్ట్‌ వరకు వెళ్లేలా కనిపిస్తుంది. కోర్ట్ కూడా ఇప్పుడు ఆయన విషయంలో సీరియస్‌గానే ఉంది. ఓ ఛానెల్ ఈయనపై కోర్టు కేస్ పెట్టడంతో కోర్టు కూడా బెల్లంకొండకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. 


తమకు చెల్లించాల్సిన 3..5 కోట్లను తిరిగివ్వటంలో బెల్లంకొండ సురేష్ విఫలమయ్యారని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ ఒకటి కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఏకంగా అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. అసలు విషయం ఏంటంటే.. 2010లో యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘బాండ్‌ బాజా బరాత్‌’ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రంతోనే రణ్ వీర్ సింగ్ ఇండస్ట్రీకి వచ్చాడు. ఈ సినిమాను తెలుగులో ఫ్రీమేక్ చేసింది నందిని రెడ్డి. 2013లో ఈమె తెరకెక్కించిన జబర్దస్త్ అచ్చంగా దీనికి కాపీ. 


బెల్లకొండ సురేష్‌ నిర్మించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, సమంత, నిత్యామీనన్ జంటగా నటించారు. తమ సినిమాలో ఒకటి రెండు కాదు ఏకంగా 19 సీన్లు కాపీ చేశారని ఆరోపిస్తూ యష్‌రాజ్‌ ఫిలింస్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అప్పట్లో ఈ కోర్ట్ సినిమా ప్రదర్శనను నిలిపేసింది. అయితే జబర్దస్త్‌ సినిమా సెట్స్‌పై ఉండగానే ఓ ఛానెల్ ఈ సినిమాను 3.5 కోట్లు ఇచ్చి మరీ శాటిలైట్ తీసుకుంది. అయితే కోర్ట్ ఆదేశాల మేరకు ఈ చిత్రాన్ని ఎక్కడా ప్రదర్శించకూడదని తీర్పు వచ్చింది. 


టెలికాస్ట్‌ చేయవద్దని కోర్టు ఆదేశించడంతో తాము చెల్లించిన డబ్బును వెనక్కివ్వాలని బెల్లంకొండను సదరు టీవీ ఛానెల్‌ కోరింది. కానీ ఇప్పటికీ ఆ డబ్బు ఆయన చెల్లించలేదు. అడిగిన ప్రతీసారి ఇప్పుడు రేపు అంటూ కాలయాపన చేస్తుండటంతో ఛానెల్‌ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. అప్పుడు బెల్లంకొండ తీసుకున్న 3.5 కోట్లు కాస్తా ఇప్పుడు లెక్కల ప్రకారం 11.75 కోట్లకు చేరింది. దాంతో కోర్టు ఇప్పుడు బెల్లంకొండ సురేష్‌పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. మరి ఈ కేస్ ఎలాంటి మలుపులు తిరగనుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: