టాలీవుడ్ సీనియర్ నటులు దేవదాస్ కనకాల మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. 1945 లో యానాంలోని కనకాల పేటలో దేవదాస్ జన్మించారు. ఈయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు ఫ్రెంచి పాలనలో ఎమ్మెల్యే కూడా. దేవదాస్ చదువు పూర్తయ్యాక యాక్టింగ్ మీద ఆసక్తి పెంచుకున్నారు. పూణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేసి సినిమా అవకాశాల కోసం మద్రాస్ లో ప్రయత్నించారు. దేవదాస్ దాదాపు 100 సినిమాల్లో నటించారు.

 

మద్రాసులో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అప్పటికే పలువురికి నటనలో శిక్షణ ఇస్తున్న లక్ష్మీదేవితో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వయసులో దేవదాస్ కంటే ఆమె ఆరేళ్ల పెద్ద. లక్ష్మీదేవి తనకు దక్కిన వరమని చాలా ఇంటర్యూల్లో చెప్పారు. తరువాత కొన్నాళ్లకి వీరు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. ఆ సమయంలో వీరి వద్ద శిక్షణ పొంది తర్వాత రోజుల్లో సూపర్ స్టార్లు అయిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, నవ్వుల రేడు రాజేంద్రప్రసాద్ ఉన్నారు. దేవదాస్ కు నటన పట్ల ఆసక్తి ఉన్నా ఔత్సాహికులకు యాక్టింగ్ లో శిక్షణ ఇవ్వడంపైనే దృష్టి సారించారు. దర్శకత్వంపై మక్కువతో, తన శిష్యులకు అవకాశాలు కల్పించడం కోసమే ఆరు సినిమాలకు దర్శకత్వం వహించారు. తనయుడు రాజీవ్ కనకాల సినీ ఆర్టిస్టుగా కోడలు సుమ యాంకర్ గా రాణిస్తున్నారు. తనతోపాటు కుమారుడు, కుమార్తెవి కులాంతర వివాహాలే కావడం యాదృచ్ఛికమేనని దేవదాస్ ఓ ఇంటర్యూలో చెప్పారు.

 

మెగాస్టార్ చిరంజీవి దేవదాస్ ఇంటికి వెళుతూండే వారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ను తట్టుకోలేక చిరంజీవితో “ఇక మా ఇంటికి రాకు” అని చెప్పేశారు. దేవదాస్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రోజుల్లో తనతో సినిమా చేయాలని రజనీకాంత్ అవకాశం ఇస్తే సున్నితంగా తిరస్కరించారట. ‘నాకు తమిళ్ రాదు, నీ కాల్షీట్స్ వేరేవాళ్లకి అమ్ముకోవాలి.. ఇదంతా నాకిష్టం లేద’ని సున్నితంగా తిరస్కరించారట. గతేడాదే దేవదాస్ కనకాల సతీమణి శ్రీలక్ష్మి మృతి చెందారు. ఆ సంఘటనతో దేవదాస్ కుంగిపోయారు. ఎందరో సిని కళాకారుల్ని వెలుగులోకి తెచ్చేందుకు శ్రమించిన ఈ గురువు.. ఇక సెలవంటూ వెళ్లిపోవడం తెలుగు సినీ కళామతల్లి ఓ ముద్దుబిడ్డను కోల్పోయినట్టే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: