స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చెయ్యాలని  గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీ మేలు కోరే ప్రతిఒక్కరూ ఎన్నో సందర్భాల్లో  ఎన్నో సార్లు చెప్పినా.. మన స్టార్ హీరోలు మాత్రం ఏడాదికి ఒక్క సినిమాకి మాత్రమే, పరిమితం అయిపోతున్నారు.  అసలు స్టార్ హీరోలు  ఎక్కువ సినిమాలు చెయ్యడం వల్ల.. ఎక్కువ లాభం కూడా ఆ హీరోలకే.  ముందుగా  మూస ధోరణికి  బ్రేక్‌ వేస్తూ..  సరికొత్త  ప్రయోగాలు చేస్తూ..  స్టార్ల అనే  ఇమేజ్‌ చట్రాల మధ్య నలిగిపోకుండా  అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించొచ్చు.   సినిమా సినిమాకి  అభిమానుల సంఖ్యను పెంచుకోవచ్చు.  ఒకసారి  గతంలోకి వెళ్లి పరిశీలిస్తే..  సీనియర్ ఎన్టీఆర్ ఇలానే చేశారు. 'పాతాళ భైరవి' లాంటి ఆల్ టైం మాస్ ఫిల్మ్ చేసాక కూడా.. 'పిచ్చి పుల్లయ్య'  'కలసి ఉంటే కలదు సుఖం' లాంటి అచ్చ కుటుంబ కథా సినిమాలు తీసి  తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఒక్క ఎన్టీఆరే కాకుండా  ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు తదితర స్టార్‌ లంతా ఎక్కువ చిత్రాలు  చెయ్యడం వల్లే  విభిన్నమైన పాత్రల్లో అద్భుతమైన సినిమాల్లో  నటించి  తమకంటూ ఒక సెపెరేట్ బాణీని సృష్టించుకున్నారు.  అందుకే   అప్పటి హీరోల్లో ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక శైలి ఉంటుంది.  


మరి ఇప్పటి స్టార్ హీరోలకు ఓ బాణి ఉందా.. సరిగ్గా చూస్తే  సగంమందిది హీరోలది ఒకటే శైలి కదా. దీనికి  కారణం ఒక్కటే..  పదేళ్ల కెరీర్ లో పట్టుమని పది సినిమాలు కూడా చెయ్యలేకపోవడం.  ఎక్కువ సినిమాలు చేస్తే.. తమకంటూ ఓ బాణి ఏర్పడేది. పైగా ఆ సినిమాల్లో  ఎదొక సినిమా సూపర్  హిట్ అవుతుంది.  అభిమానులు ఆ సినిమా విజయంతో  తమ అభిమాన హీరోని ఆరాధిస్తూ అలాగే కొనసాగేవారు.  అందుకే ఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకూ ఎప్పటికప్పుడూ  అభిమాన సంఘాల హడావుడి కనిపించేది. అయితే, ఇప్పటి స్టార్స్ కు కూడా చొక్కాలు చింపుకునే  ఫ్యాన్స్  ఉన్నారు. కానీ ఆ హడావుడే లేదు. పైగా  యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి  డిజిటల్ ప్లాట్ ఫామ్ ల రాకతో సినిమా స్థితి పరిస్థితే కాదు, ప్రేక్షకుల ఆలోచనలూ  పూర్తిగా మారిపోయాయి. ఒక విధంగా  సినిమాలు ఇచ్చే  ఎంటర్ టైన్మెంట్ కంటే..   డిజిటిల్ అండ్ టీవీ  ప్లాట్ ఫామ్స్, ముఖ్యంగా ఐపియల్,   ప్రో కబడ్డీ, వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్స్ వంటివి  ఇచ్చే ఎంటర్ టైన్మెంటే ఎక్కువు.  ఎప్పటికప్పుడు అవి  అప్ డేట్ అవుతూ.. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు అతి వేగంగా మారుతూ.. ప్రేక్షకులను తమ వైపుకు తిప్పుకుంటున్నాయి పైన చెప్పుకున్న  ఎంటర్ టైన్మెంట్ రంగాలు.  మరి ఇప్పటికైనా స్టార్ హీరోలు మారి సినిమాలను ఎక్కువ చెయ్యకపోతే.. ప్రేక్షకులు కూడా ఇతర  ఎంటర్ టైన్మెంట్ రంగాలకు అలవాటు పడతారు. 


ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాలు చూడటం తగ్గింది. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తేనే ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి కదులుతున్నారు.  అదే ఆ  సినిమాకు యావరేజ్, బిలో యావరేజ్ టాక్ వస్తే మాత్రం.. ఎలాగూ  నెల రోజుల్లో  ఏ అమెజాన్ ప్రైమ్ లోనే,  నెట్ ఫ్లిక్స్ లోనే  చూడొచ్చులే అని.. ప్రేక్షకుడు  ఆ ప్లాప్  సినిమాని  లైట్ తీసుకుంటున్నారు.  అందుకే, ప్లాప్ టాక్ తెచ్చుకున్న  స్టార్ హీరోల సినిమాలకు భారీ మొత్తంలో నష్ట పోతున్నాయి.  అదే ఏదొక స్టార్ హీరో సినిమా ప్రతి వారం ఉంటే.. ప్రేక్షకుడు చూపు ఎప్పుడూ థియేటర్ వైపు ఉంటుంది. అందుకే ఇప్పటికైనా స్టార్ హీరోలు మారాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: